ఉదయం నిరసన- సాయంత్రం మరమ్మతులు

– ఎమ్మెల్యే చొరవ, తాగునీటి సమస్యకు పరిష్కారం 
నవతెలంగాణ పెద్దవంగర: తాగునీటి సమస్య తీర్చాలంటూ పెద్దవంగర మండల కేంద్రానికి చెందిన మహిళలు రోడ్డుపై ఖాలీ బిందెలతో గురువారం ఉదయం నిరసన తెలిపారు. గ్రామంలోని పశువుల వైద్యశాల సమీపంలోని మంచినీటి బోరు తరచుగా మరమ్మతులకు గురవుతుంది. బోరు కు మరమ్మతులు చేసి, సమస్యను పరిష్కరించాలంటూ మహిళలు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సమస్యను ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు. సమస్య గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, తాగునీటి సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ కు సూచించారు. వెంటనే స్పందించిన ఆయన సాయంత్రం వరకు కొత్త మోటార్ బిగించి, బోరు కు మరమ్మతులు చేయించారు. సుధీర్ఘ కాలంగా వేదిస్తున్న తాగునీటి సమస్యను పరిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్యే కు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ప్రత్యేకాధికారి బుదారపు శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు వెంకట్ రెడ్డి, సుంకరి అంజయ్య, ధర్మారపు వెంకన్న, కందుల యాకరాజు, చిలుక వెంకన్న, చిలుక రామచంద్రు, సాయి తదితరులు పాల్గొన్నారు.