– ఘటన నుంచి బయటపడిన డ్రైవర్
మాస్కో : సీనియర్ సైనిక జనరల్ సహా ఇద్దరు మృతికి కారణమైన మాస్కో బాంబు పేలుడుకు సంబంధించి అనుమానితుడిని తమ అదుపులోకి తీసుకున్నట్లు రష్యన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఎఫ్‌ఎస్‌బి బుధవారం తెలిపింది. ఆ అనుమానితుడు ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ రిక్రూట్ చేసుకున్న ఉజ్బెక్ పౌరుడని పేర్కొంది. ఆ వ్యక్తి పేరును ఎఫ్‌ఎస్‌బి వెల్లడించలేదు. ఉక్రెయిన్ తనను నియమించిందని ఆ వ్యక్తే చెప్పాడని, 30ఏళ్ల లోపు వయసు వుందని తెలిపింది.
ఉక్రెయిన్‌లో మాస్కో మిలటరీ ఆపరేషన్ సందర్భంగా చేపట్టిన చర్యలపై బ్రిటన్, కెనడాలతో సహా పలు దేశాల నుండి రష్యా సైనిక జనరల్ కిరిలొవ్ ఆంక్షలు ఎదుర్కొంటున్నారు. నిషేధిత రసాయన ఆయుధాలతో యుద్ధం చేస్తున్నారంటూ సోమవారం ఉక్రెయిన్ ఆయనపై క్రిమినల్ దర్యాప్తు చేపట్టగా, మంగళవారం బాంబు దాడిలో చనిపోయారు. ఈ దాడిలో కిరిలొవ్ ప్రయాణిస్తున్న కారు బాగా దెబ్బతినగా, డ్రైవర్ గాయాలతో బతికి బయటపడ్డాడు. తన నివాసం నుండి కిరిలొవ్ బయటకు రాగానే రిమోట్ పరికరంతో పేలుడు పదార్ధాలను పేల్చివేసినట్లు భావిస్తున్నారు. పేలుడుకు 1.5 మీటర్ల దూరంలోనే వున్న కిరిలోవ్ ఆయన సహాయకుడు చనిపోయారు. ఆ సమయంలో డ్రైవర్ తన అధికార వాహనంలో వున్నారు. ఆ పేలుడు ధాటికి డ్రైవర్ కంగారు పడ్డాడు. పదునైన ముక్కలు ముఖంపై లోతుగా గుచ్చుకుపోవడంతో డ్రైవర్ ముఖం గుర్తు పట్టడానికి వీల్లేకుండా పోయింది. ఉక్రెయిన్ స్పెషల్ సర్వీసెస్ ఈ దాడికి పాల్పడ్డాయని రష్యా దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.