అత్యంత ప్ర్రతిష్టాత్మకంగా..

అత్యంత ప్ర్రతిష్టాత్మకంగా..నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం విశేషం. ఈ శుభతరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్‌ 1న జరగబోయే వేడుక వివరాలను వెల్లడించేందుకు బుధవారం ఎఫ్‌ఎన్‌సీసీలో క్టరన్‌ రైజర్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందమూరి రామకష్ణ, నందమూరి మోహనకష్ణ సంయుక్తంగా స్వర్ణోత్సవ వేడుకల పోస్టర్‌ను లాంచ్‌ చేశారు.
దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, కైకాల నాగేశ్వరరావు, దామోదర్‌ ప్రసాద్‌, ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రెసిడెంట్‌ భరత్‌ భూషణ్‌, సీ కల్యాణ్‌, దర్శక, నిర్మాత వైవీఎస్‌ చౌదరి, తుమ్మల ప్రసన్న కుమార్‌, ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ అనిల్‌ కుమార్‌, డైరెక్టర్‌ బోయపాటి శ్రీను, డైరెక్టర్‌ కోదండరామిరెడ్డి, నటుడు మాదాల రవి, మా అసోసియేషన్‌ ట్రెజరర్‌ శివబాలాజీ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
రచయిత పరుచూరి గోపాలకష్ణ మాట్లాడుతూ..’ఒకొక్క హీరోకు ఒక్కో బాడీ లాంగ్వేజ్‌ ఉంటుంది. అలా బాలయ్యకు డిఫరెంట్‌ బాడీ లాంగ్వేజ్‌ ఉంది. తొడకొట్టే డైలాగ్‌ బాలయ్యకే సూట్‌ అవుతుంది. మేము రాసిన ప్రతి సినిమా బాలయ్యకు సక్సెస్‌ అయింది. అన్ని అసోసియేషన్స్‌ కలుపుకుని బాలయ్య 50 ఏళ్ల వేడకను ప్రతిష్టాత్మక వేడుకగా, ప్రపంచానికి తెలిసేలా చేయాలని కోరుతున్నాను’ అని చెప్పారు.