– రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
– తల్లుదండ్రులు పిల్లలను చదువులతో పాటు క్రీడల్లో ప్రోత్సహించాలి
– భవిష్యత్తు తీర్చిదిద్దుకోవడానికి క్రీడలు ఎంతో అవసరం
– ఘనంగా మండల అంతర్ పాఠశాలల క్రీడలు ప్రారంభం
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
ఉద్యమ స్ఫూర్తి కలిగిన మోతె గ్రామం, మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఉపిరిలూదిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం వేల్పూర్ మండలంలోని మోతే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్ జి ఎఫ్) మండల అంతర పాఠశాలల క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి, క్రీడల పతాకాన్ని ఆవిష్కరించి, మండల క్రీడలను ప్రారంభించారు. విద్యార్థుల మార్చ్ ఫాస్ట్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఉద్దేశించి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ…ఆనాడు ఉద్యమ నాయకులు కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తిని పొందేందుకు మోతే మట్టిని ముడుపు కట్టి తెలంగాణ భవన్ తీసుకెళ్లారని గుర్తు చేశారు.మళ్ళీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో మోతె వచ్చి ముడుపు విప్పారన్నారు. క్రీడలలో పాల్గొంటున్న విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన ఆటల్లో గెలుపోటములు సహజమని, విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని అలవరచుకోవాలన్నారు. జీవితంలో ఎదురయ్యే అటుపోటులను ఎదుర్కోని నిలబడటానికి క్రీడలు మనకు మనోనిబ్బరాన్ని, ధైర్యాన్ని ఇస్తాయని పేర్కొన్నారు.తల్లుదండ్రులు తమ పిల్లలను చదువుల్లోనే కాకుండా క్రీడల్లో కూడా ప్రోత్సహించాలన్నారు. వేల్పూర్ మండల స్థాయి క్రీడల నిర్వహణకు ముందుకు వచ్చిన మోతె గ్రామానికి, క్రీడలు ఇంత గొప్పగా నిర్వహించడానికి గ్రామం నుండి అనేక మంది దాతలు ముందుకు వచ్చారని,వారికి పాఠశాల యాజమాన్యానికి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు, గ్రామ యువకులకు అభినందనలు తెలిపారు.అంతర పాఠశాల క్రీడా పోటీలను రాష్ట్ర స్థాయి పోటీల లాగా గొప్పగా ప్రారంభించుకోవడం అభినందనీయమన్నారు. మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యకరమైన జీవితానికి, ఉన్నతంగా మన భవిష్యత్తు తీర్చిదిద్దుకోవడానికి క్రీడలు ఎంతో అవసరం అన్నారు.క్రీడలు అనేవి కేవలం ఫిట్ నెస్ కోసమే కాదు..జీవితంలో మనకు ఎదురు దెబ్బలు తగిలినపుడు వాటిని తట్టుకొని నిబ్బరంగా, మనో ధైర్యంగా ఉండటానికి క్రీడలు ఉపయోగపడతాయన్నారు.క్రీడల్లో గెలుపోటములు సహజం, అన్నింటిని సమానంగా తీసుకున్నప్పుడే స్పోర్టింగ్ స్పీరిట్ విద్యార్థుల్లో అలవడుతుందన్నారు. మా కుంటుంబం మొత్తం క్రీడల బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చినవారమేనన్నారు.ప్రస్తుత సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ యుగంలో క్రీడలు అంటే మక్కువ ఉన్న సురేష్, పిఈటి లు అందరూ కలిసి క్రీడలు ఇంత గొప్పగా నిర్వహించడానికి ముందుకు రావడం శుభపరిణామమని పేర్కొన్నారు.