అనారోగ్యంతో తల్లి మృతి

– తట్టుకోలేక తనయుడు ఆత్మహత్య
నవతెలంగాణ-ఓయూ
అనారోగ్య సమస్య కారణంగా తల్లి మరణించడంతో అది తట్టుకోలేక కొడుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్‌ లాలాగూడ పోలీస్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ రఘుబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. లాలాపేటలోని వినోభానగర్‌ ప్రాంతానికి చెందిన లక్ష్మి(52), అభినరు(20) తల్లీకొడుకులు. వీరిద్దరూ ఎనిమిది సంవత్సరాలుగా అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. తల్లి క్యాన్సర్‌ పేషెంట్‌ కాగా, అభినరు డిగ్రీ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. తల్లి మందుల ఖర్చుకు, కాలేజీ ఫీజుకు అభినరు చేతికి దొరికిన పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, శనివారం మధ్యాహ్నం సమయంలో వీళ్లు నివాసముంటున్న ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇంటి యజమాని బ్రహ్మాజీ వారి గది తలుపులు ఎంత కొట్టినా తెరవలేదు. దాంతో లాలాగూడ పోలీసులకు సమాచారం అందజేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి తలుపులు పగులగొట్టారు. హాల్లో అభినరు సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. బెడ్‌రూంలో తల్లి కూడా మృతిచెంది ఉంది. పోలీసులు ఇంటిని పరిశీలించగా మృతురాలికి సంబంధించిన మెడికల్‌ రిపోర్ట్‌తో పాటు అభినరు రాసిన సూసైడ్‌ నోట్‌ కనిపించింది. అందులో ‘నాకు, మా అమ్మకు ఆరోగ్య సమస్యలున్నాయి. నాకు తండ్రి లేడు. మా బంధువుల కోసం వెతక్కండి. ఐ యామ్‌ సారీ’ అని ఇంగ్లీష్‌లో రాసుంది. కాగా తల్లి అనారోగ్యంతో చనిపోవడంతో అది తట్టుకోలేక అభినరు ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. వీరు మృతిచెంది రెండ్రోజులు కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.