‘తల్లి మనసు’కి వెండితెర రూపం..

To the 'mother's mind'
Silver screen form..రచిత మహాలక్ష్మి, కమల్‌ కామరాజు, సాత్విక్‌, సాహిత్య ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘తల్లి మనసు’. వి.శ్రీనివాస్‌ (సిప్పీ) దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ముత్యాల మూవీ మేకర్స్‌ పతాకంపై ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్‌ తొలిసారి నిర్మాతగా మారి, నిర్మించిన చిత్రమిది. ఇటీవల సెన్సార్‌ కార్యక్రమాలను ఈ సినిమా పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా నిర్మాత ముత్యాల అనంత కిషోర్‌ మాట్లాడుతూ,’ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్‌ సభ్యులు చాలా బావుందని, తల్లికి సంబంధించిన మంచి సబ్జెక్టుతో ఇటీవల కాలంలో ఇలాంటి చిత్రం రాలేదని ప్రశంసించడం ఆనందంగా ఉంది. అలాగే కొద్ది రోజుల క్రితం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశల్లో మా సినిమాను చూసిన కొందరు స్నేహితులు సైతం అభినందించారు. డిసెంబర్‌ చివరి వారంలో లేదా జనవరి మొదటి వారంలో అనుకూలమైన తేదీని చూసుకుని చిత్రాన్ని విడుదల చేస్తాం. నైజాంలో ఈ చిత్రాన్ని ఏషియన్‌ ఫిలిమ్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా రిలీజ్‌ చేస్తాం’ అని చెప్పారు.
‘తల్లి సబ్జెక్ట్‌తో ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలని మేము ఏదైతే ఆశించి, మా సొంత బ్యానర్‌లో ఈ చిత్రాన్ని తీశామో అది నెరవేరింది. ఇలాంటి మంచి సినిమాతో మా అబ్బాయి నిర్మాతగా చిత్ర పరిశ్రమలోకి ఎంటర్‌ కావడం సంతోషదాయకం’ అని చిత్ర సమర్పకులు ముత్యాల సుబ్బయ్య అన్నారు. దర్శకుడు వి.శ్రీనివాస్‌ (సిప్పీ) మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో ఓ మధ్య తరగతి తల్లి ఎలాంటి సంఘర్షణలకు గురయ్యిందన్న అంశాన్ని ప్రేక్షకులకు హత్తుకునేలా వైవిధ్యంగా చెప్పాం. ఆద్యంతం పాత్రలు మాత్రమే కనిపించి, ప్రేక్షకుడు కథలో లీనమవుతాడు’ అని తెలిపారు.