మదర్‌ మూన్‌ లైటింగ్‌….

వేతనం లేదు కానీ
అమ్మ మూన్‌ లైటింగ్‌ చేస్తుంది
ఒకే రోజున
ఇంటిలో పని మనిషి పాత్ర
అఫీస్‌లో ప్రగతిశీల మహిళగా

న్యాయం కాదు కానీ
ఏక కాలంలో
రెండు శిక్షలు అనుభవిస్తుంది
ఆడ జన్మ అవమానాలు
మధ్యతరగతి అవసరాల లేమి

పొగ రావట్లేదు కానీ
కూడ బలుక్కుని
అమ్మ డబుల్‌ ఇంజిన్‌ గాడి లా
పుట్టింటి అవసరానికి ఆసరాగా
మెట్టినింటినీ ఇంకో అంతస్తుకు లాగుతూ

ధారలు కనబడవు కానీ
అమ్మ అంతర్వాహిని
రెండు కళ్లు జీవ నదులే
తల దిండు కొంత
వాష్‌ రూమ్‌ మరికొంత
వాయిదాల చొప్పున పంచుకుంటూ

బహుమతులు లు లేవు గానీ
నిత్యం పోటీ లోనే
గోడ మీద గడియారం తో
కాళ్ళ కింది భూమి సహనం తో
సంస్కతిసాంప్రదాయాలను భుజాన మోస్తూ…

– దాసరి మోహన్‌, 9985309080