శ్రమైక జీవనానికి ప్రతీక ‘తెలంగాణ తల్లి’

– పదేండ్లలో కేసీఆర్‌ ఎందుకు ఏర్పాటు చేయలేదు? : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వేముల వీరేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
శ్రమైక జీవనానికి ప్రతీకగా తెలంగాణ తల్లిని రూపొందించామని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వేముల వీరేశం తెలిపారు. సోమవారం శాసనసభ మీడియా పాయింట్‌ వద్ద వారు మాట్లాడుతూ పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు అధికారికంగా ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ సర్కార్‌ సబ్బండ వర్ణాలు మెచ్చేలా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఎందుకు విమర్శిస్తు న్నారని నిలదీశారు. 2006లో స్వరాష్ట్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న తరుణంలో ప్రజల్లో స్ఫూర్తి నింపేందుకు బీఆర్‌ఎస్‌ తెలంగాణ తల్లిని రూపొందించిందని అన్నారు. ఆ విగ్రహ రూపాన్ని అప్పట్లోనే మేధావులు, కవులు, కళాకారులు ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాదిలోనే తెలంగాణ జాతీయ గీతంతో పాటు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ భావోద్వేగాలకు సంబంధించిన అంశంపై శాసనసభలో చర్చ జరుగుతుండగా, ప్రధాన ప్రతిపక్షనేత ఎందుకు అసెంబ్లీకి రాలేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ నుంచి బీఆర్‌ఎస్‌గా మారిన ఆ పార్టీకి తెలంగాణ తల్లిపై మాట్లాడే హక్కు లేదని తేల్చి చెప్పారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు విమర్శలు మాని సర్కార్‌ చేస్తున్న మంచి పనులకు సహకరించాలని కోరారు.