బాధ్యతగా ఉండాలి తల్లీ

Mother should be responsible– పియ్రమైన వేణు గీతికకు అమ్మ రాయునది:
ఎలా ఉన్నావు? నేను ఇంతకు ముందు రాసిన ఉత్తరం చదివి ఉంటావని ఆశిస్తున్నాను. నాన్న, ఈ ఉత్తరం ద్వారా నీకు నేను చెప్పే విషయం ఏమిటంటే… కుటుంబం పట్ల నువ్వు ఎంత బాధ్యతగా ఉంటున్నావో, ముందు ముందు ఇంకా బాధ్యతగా ఉండాలి. చిన్నప్పటి నుండి చెప్పిన మాట వింటూ, అవసరమైనప్పుడల్లా అమ్మకు సాయంగా ఉన్నావు. నాకు ఒంట్లో నలతగా వుంటే నీ బుజ్జి బుజ్జి చేతులతో ‘అమ్మా! బబ్బ’ అంటూ తెచ్చేదానివి. కొంచం పెద్దయ్యాక టీ పెట్టి ఒక ప్లేట్‌లో బిస్కెట్స్‌ పెట్టి ‘అమ్మా, టీ తాగు’ అని ఇచ్చేదానివి. నువ్వు స్కూల్‌ నుంచి వచ్చేటప్పటికి నేను పడుకుని ఉంటే నన్ను లేపకుండా నువ్వే నూడుల్స్‌ చేసుకుని తినేదానివి. నేను దుప్పటి కప్పుకోకుండా పడుకుంటే దుప్పటి తెచ్చి కప్పేదానివి. ఇవన్నీ నా చిట్టి తల్లి చేస్తుంటే ఓ వైపు బాధ, మరోవైపు నా పట్ల నువ్వు చూపిస్తున్న శ్రద్దకు ఎంతో సంతోషం వేసేది.
నాన్న… కుటుంబం అన్న తర్వాత ఇంటి విషయాల్లో బాధ్యత అవసరం. ముఖ్యంగా అమ్మా, నాన్న పట్ల బాధ్యతగా ఉండాలి. అమ్మకు, నాన్నకు ఒంట్లో బాగాలేకపోతే డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లడం, మందులు ఇవ్వడం, సమయానికి తింటున్నారా లేదా వంటివి దగ్గరుండి చూసుకోవాలి. ఉద్యోగరీత్యా దూరంగా ఉండాల్సి వస్తే మేము డాక్టర్‌ దగ్గరకు వెళ్తే వాళ్ళు ఏమి చెప్పారు, మందులు తెచ్చుకున్నారా, సమయానికి తింటున్నారా, టెస్టులు చేయిస్తే ఏమి చేయించారో ఆ రిపోర్ట్స్‌ పంపించమని అడగటం చేయాలి. మా పెద్ద వాళ్లకు కావాల్సింది కాస్త కేరింగ్‌ నాన్న. అది ఉంటే మానసికంగా ఎంతో ధైర్యవంతుల మవుతాం. ఈ వయసులో మా హెల్త్‌ విషయంలో కేర్‌ తీసుకోవాలి. చిన్నప్పుడు మేము నీ విషయంలో ఎలా కేర్‌ తీసుకున్నామో అలాగే నువ్వూ మా విషయంలో బాధ్యతగా ఉండాలి తల్లీ. వయసు వచ్చి మాకు చేసుకునే శక్తి లేనప్పుడు, బిడ్డగా మా అవసరాలు తీర్చాల్సింది నువ్వే కదా! ఉద్యోగాన్ని, కుటుంబాన్ని సమన్వయం చేసుకునేందుకు పరిష్కా రాలు వెదకాలి. ఒక్కొక్క సారి మా ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉండ వచ్చు. అనారోగ్యం వల్ల చికాకు, కోపం ఎక్కువ కావచ్చు. మతిమరుపు రావచ్చు, చూపు ఆనక పోవచ్చు ఇలా ఎన్నో వుంటాయి. అటువంటప్పుడు విసుక్కోకుండా, చిరాకు పడకుండా ఓర్పుతో మమ్మల్ని చూసుకోవాలి చిట్టిపండు. అయితే కేవలం మేము మాత్రమే కాదు బంధు వులు, స్నేహితులు, సమాజం, నీ తోటి ఉద్యోగులు ఇలా నీ చుట్టూ ఎందరో ఉన్నారు. వారితో ఎలా మెలగాలో ఒక్కొక్కటి నీకు వివరంగా చెప్తాను. ఉంటాను మరి..
ప్రేమతో అమ్మ
– పాలపర్తి సంధ్యారాణి