ఉద్యమం నుంచే తెలంగాణ తల్లి పుట్టింది

– విజయోత్సవాల పేరిట విష సంస్కృతికి తెరలేపారు : మాజీ మంత్రి జి.జగదీష్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
స్వరాష్ట్ర ఉద్యమంలోంచే తెలంగాణ తల్లి పుట్టిందని మాజీ మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పదాన్నే నిషేదించాలనే స్ధాయికి అప్పటి పాలకులు వెళ్లిన పరిస్థితుల్లో ఉవ్వెత్తున్న ఎగిసిన ఉద్యమమే తెలంగాణ తల్లికి బౌతిక రూపం ఇచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారులను తుపాకి పట్టుకుని తరిమిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమైక్య బాస్‌లను సంతృప్తి పరిచేందుకే కొత్తతల్లిని ప్రతిష్టించారని విమర్శించారు. ఏడాది పాలన విజయోత్సవాలను సైతం తెలంగాణ సంస్కృతిని మసక బార్చేందుకు వాడుకున్నారని ఆరోపించారు. విగ్రహావిష్కరణలోను అదే దోరణి కనిపించిందని పేర్కొన్నారు. సమైక్య వాదులు 80 యేండ్ల కింద పన్నిన కుట్రలు మళ్ళీ మొదలయ్యాయని వ్యాఖ్యానించారు. సాంస్కృతిక కార్యక్రమాల పేరిట సినిమా పాటలు పాడించారని గుర్తు చేశారు. తెలంగాణ బాష, యాసను ఉమ్మడి రాష్ట్రంలో తొక్కేశారనీ, తిరిగి అదే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తాము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమంలోంచి పుట్టిన తెలంగాణ తల్లే ఉంటుందని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, మెతుకు ఆనంద్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు మన్నె గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.