– ఐదో రోజు ఈడీ కస్టడీ
– నేడు సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సీబీఐ స్పెషల్ కోర్టు ఆదేశాలతో ఐదో రోజు ఈడీ కస్టడీలో ఉన్న కవితను తొలిసారి ఆమె తల్లి శోభ గురువారం కలిశారు. ఆమె వెంట కేటీఆర్, ఆడపడుచు సౌమ్య(సంతోష్ సోదరి), లాయర్ మోహిత్ రావు వెళ్లారు. తొలిత 40 నిమిషాల పాటు కుటుంబ సభ్యులు కవితతో మాట్లాడారు. మిగిలిన 15 నిమిషాలు.. కేటీఆర్, అడ్వకేట్ మోహిత్ చర్చించారు. తొలుత తల్లి, కూతురు ఒకరినొకరు చూసుకోగానే… ఇద్దరు ఒకింత భావోద్వేగానికి లోనైనట్లు తెలిసింది. ఈ సందర్బంగా కవిత, కేటీఆర్ తల్లి శోభకు ధైర్యం చెప్పారు. తానేమి తప్పు చేయలేదని, రాజకీయ కక్ష సాధింపులో తనపై అభియోగాలు మోపారని కవిత అన్నట్లు సమాచారం. త్వరలోనే బయటకు వస్తానని, అంతవరకు అమ్మ, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని సౌమ్యకు కవిత చెప్పారు. అనంతరం రోజు వారి విచారణపై కేటీఆర్, న్యాయవాది మోహిత్ ఆరా తీశారు. నేడు (శుక్రవారం) సుప్రీంకోర్టు ముందుకు కవిత పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో… కవిత తరపు అంశాలను వాదించేందుకు న్యాయవాది మోహిత్ పలు వివరాలను నోట్ చేసుకున్నట్లు తెలిసింది.
నేడు సుప్రీం ముందుకు కవిత కేసు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్, కస్టడీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన తాజా పిటిషన్ నేడు (శుక్రవారం) సుప్రీంకోర్టుకు ముందు రానుంది. తన అరెస్ట్ అక్రమమని, రిమాండ్ ఉత్తర్వులు రద్దు చేయాలని మొత్తం 537 పేజీలతో కూడిన క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఈడీ కీలు బొమ్మగా (పఫ్పెట్) మారిందని ఆరోపించారు. పొలిటికల్ ఎజెండాతో ఈడీ అధికారులు పని చేస్తున్నారని పిటిషన్‌లో ప్రస్తావించారు. సుప్రీంకోర్టులో గత పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే సోదాల పేరుతో హైదరాబాద్‌లోని తన నివాసం లోకి వచ్చిన ఈడీ అధికారులు అక్రమంగా తనను అదుపులోకి తీసుకున్నారని ప్రస్తావించారు. ఈడీ కస్టడీ విధింపు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 21, 22(1), (2) ప్రకారం విరుద్ధమని పేర్కొన్నారు. తాజా పిటిషన్‌పై తుది తీర్పు వెలువడే వరకు పలు షరతులు విధిస్తూ తక్షణమే కవితను విడుదల చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కాగా ఈ పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది. ఈమేరకు సుప్రీం కోర్టు కవిత పిటిషన్‌ను విచారణ జాబితాలో చేర్చింది.