మన భూమి ప్రమాదంలో ఉందని మనందరికీ తెలుసు. కాలుష్యం, వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలన, సహజ వనరుల క్షీణత వంటివి భూగోళాన్ని రక్షించడానికి మనకు పెద్ద సవాళ్లుగా మారాయి. అయితే చాలా మంది శాస్త్రవేత్తలు, నిపుణులు, కార్యకర్తలు పర్యావరణాన్ని మరింత క్షీణత నుండి రక్షించడానికి, ఈ ప్రపంచాన్ని రాబోయే తరాలు జీవించగలిగేలా ఉంచడానికి గణనీయమైన కృషి చేస్తున్నారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. వారిలో ఈ ఐదుగురు మహిళా పర్యావరణవేత్తలు, కార్యకర్తలు వివిధ పర్యావరణ సంబంధిత రంగాలలో చేసిన కృషి అమూల్యమైనది. ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వారి గురించి తెలుసుకుందాం…
వందన శివ
వందనా శివ రీసెర్చ్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ నేచురల్ రిసోర్స్ పాలసీకి డైరెక్టర్. డెహ్రాడూన్‌లో ఉన్న ఈ సంస్థ అడవుల రక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ, పర్యావరణ సంబంధిత విషయాలలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి పని చేస్తోంది. వందన ‘ఎకో-ఫెమినిస్ట్’ అంటే పర్యావరణ స్త్రీవాది. వ్యవసాయంలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఆమె బలమైన వాదన. మహిళలు, ప్రకృతి రెండూ పురుషులచే దోపిడీ చేయబడతాయని, దీని కారణంగా పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత అనే అంశాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని ఆమె నమ్ముతారు. 1987లో వందన ‘నవధాన్య’ అనే ఎన్‌జీఓని స్థాపించారు. ఇది సేంద్రీయ వ్యవసాయం, జీవ వైవిధ్య పరిరక్షణ, రైతుల హక్కులపై పనిచేస్తుంది. నవధాన్య ఇప్పటివరకు సుమారు 2000 రకాల వరిని సంరక్షించగలిగింది. అలాగే భారతదేశంలోని 22 రాష్ట్రాల్లో 122 ‘విత్తన బ్యాంకులను’ స్థాపించింది. ఇక్కడ వివిధ రకాల విత్తనాలను సంరక్షించడం, అధ్యయనం చేయడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఆమె చేస్తున్న కృషికిగాను 1993లో ‘రైట్ లైవ్లీహుడ్’ అవార్డు, 2010లో సిడ్నీ పీస్ ఫ్రైజ్, 2012లో పుకుయోకా ఆసియన్ కల్చర్ ఫ్రైజ్, 2016లో మిరోదీ పురస్కారం అందుకున్నారు.
అనుమితా రారు చౌదరి
జూజు పరిశోధన, న్యాయవాద విభాగంలో పని చేస్తున్న ఈమె సుస్థిర అభివృద్ధి, పట్టణీకరణపై దృష్టి సారించారు. 1996లో ఢిల్లీలోని గాలిని పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో క్లీన్ ఎయిర్ క్యాంపెయిన్‌కు నాయకత్వం వహించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమం ఫలితంగా నేడు ఢిల్లీలోని చాలా పబ్లిక్ వాహనాలు డీజిల్‌కు బదులుగా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ తో నడుస్తాయి. ఇది వాహన ఉద్గార ప్రమాణాలను మెరుగుపరచడంలో విజయవంతమైంది. పర్యావరణ అనుకూల రవాణాపై విధానాలను రూపొందించడంలో కూడా సహాయపడింది. అనుమిత వాయు కాలుష్య రహితంగా చేయడానికి అనేక ప్రభుత్వ పథకాలలో పాలుపంచుకున్నారు. పర్యావరణ సమస్యలపై అనేక వార్తాపత్రికలలో రచించారు. వాతావరణ భద్రతపై జాతీయ, అంతర్జాతీయ సమావేశాలకు సభ్యురాలు, సలహాదారుగా ఆమె సహకారం విలువైనది. 2017లో యూఎస్‌ఏలోని కాలిఫోర్నియా ప్రభుత్వంచే హేగెన్ ష్మిత్ క్లీన్ ఎయిర్ అవార్డును ఆమెకు అందించారు.
సునీతా నారాయణ్
సునీత ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్’ (సిఎస్‌ఇ) డైరెక్టర్‌తో పాటు ‘డౌన్ టు ఎర్త్’ మాసపత్రికకు ఎడిటర్‌గా కూడా ఉన్నారు. ఆమె పని మొత్తం పర్యావరణం, మానవాభివృద్ధి మధ్య సంబంధంపై దృష్టి కేంద్రీకరించి ఉంటుంది. అలాగే 1989లో ఆమె జూజు వ్యవస్థాపకుడు అనిల్ అగర్వాల్‌తో కలిసి ‘గ్రీన్ విలేజెస్’ అనే పేరుతో ఒక పేపర్ రచించారు. ఇది గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణను హైలైట్ చేస్తుంది. 2012లో ఆమె భారతదేశపు ఏడవ పర్యావరణ నివేదిక, ఎక్స్‌క్రెటా మ్యాటర్స్‌ను కూడా రచించారు. ఇది మన నగరాల్లో నీటి సరఫరా, కాలుష్యంపై వివరణాత్మక విశ్లేషణను అందిస్తుంది. ‘పట్టణీకరణ అంటే పెద్ద పెద్ద భవనాలు నిర్మించడమే కాదు. పర్యావరణంపై అవగాహన లేకుండా అభివృద్ధి అసంపూర్తి. అందుకే నగరాల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అంటారు సునీత. 2005లో ఆమె పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. 2016లో టైమ్ మ్యాగజైన్ ఆమెను అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో చేర్చింది.
డాక్టర్ కృతి కారంత్
డా. కృతి యూఎస్‌ఏలోని డ్యూక్ యూనివర్శిటీ నుండి ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ పాలసీలో పీహెచ్‌డీ పట్టా పొందారు. 20 ఏండ్లుగా భారతదేశంలో వన్యప్రాణుల సంరక్షణపై పరిశోధనలు చేస్తున్నారు. బెంగుళూరులోని సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టడీస్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆమె డ్యూక్ యూనివర్సిటీ, నేషనల్ సెంటర్ ఫర్ బయాలజీలో కూడా బోధించారు. కృతి విలుప్తత, మానవ-అటవీ సంబంధాలు, అటవీ పర్యాటక ప్రభావంపై అనేక పరిశోధనలు చేశారు. ఆమె దాదాపు 90 వ్యాసాలు రచించడంతో పాటు వన్యప్రాణులపై పిల్లల పుస్తకాన్ని కూడా ముద్రించారు.
సుమైరా అబ్దుల్ అలీ
శబ్ద కాలుష్యం సమస్యపై పనిచేసే ‘ఆవాజ్ ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలు సుమైరా. ఈ రంగంలో చేస్తున్న అలుపెరగని కృషి ఫలితంగా ఆమెకు ‘సౌండ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా’ అనే పేరు వచ్చింది. 2003లో ముంబైలో ‘సైలెన్స్ జోన్’ నిర్మాణం కోసం ఆమె బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఏడేండ్ల తర్వాత 2009లో ఆసుపత్రులు, మతపరమైన స్థలాలు, విద్యాసంస్థలకు వంద మీటర్ల పరిధిలో ఉన్న 2237 ప్రాంతాలను ‘సైలెన్స్ జోన్’లుగా ప్రకటించాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)ని కోర్టు ఆదేశించింది. 2007లో ఆమె తన సంస్థ తరపున ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల హారన్లు, నిర్మాణ పనులు, బాణాసంచా శబ్దాల నియంత్రణ కోసం మరో పిటిషన్‌ను సమర్పించారు. శబ్ధ కాలుష్య నిబంధనలను అమలు చేయాలని, ముంబై నగరానికి ‘సౌండ్ మ్యాప్’ రూపొందించాలని ఈ పిటిషన్‌లో ఆమె డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లన్నింటినీ నెరవేర్చాలని 2016లో కోర్టు ఆదేశించింది. అలాగే ముంబై మినహా మహారాష్ట్రలోని అన్ని నగరాల్లో సౌండ్ స్టడీ, మ్యాపింగ్‌ను వచ్చే 25 ఏండ్ల పాటు ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలో చేర్చాలని ఆదేశించారు. సుమైరా అక్రమ ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా కూడా చురుగ్గా పని చేస్తున్నారు. దీని కారణంగా ఆమెకు ఇసుక మాఫియా నుండి బెదిరింపులు కూడా వచ్చాయి. ఉద్యమకారులపై బెదిరింపులకు వ్యతిరేకంగా మరో ఉద్యమం ప్రారంభించారు. దీనికి ఆమె సమన్వయకర్త. సుమైరా తన పనికి మదర్ థెరిసా అవార్డును అందుకున్నారు.