వనంలోకి తల్లులు..

Mothers into the forest– కన్నెపల్లికి సారలమ్మ, చిలకలగుట్టకు సమక్కొముగిసిన మేడారం జాతర
నవతెలంగాణ-ములుగు
మేడారంలో జనం నుంచి వనదేవతలు వనంలోకి చేరారు. సారలమ్మ రాక తర్వాత మహాజాతర ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజు సమ్మక్కను గద్దెపైకి తీసుకురాగా.. శుక్రవారం వన దేవతలకు మొక్కులు సమర్పించారు. శనివారం ఇద్దరు తల్లులు వన ప్రవేశం చేసారు. కన్నెపల్లికి సారలమ్మ, చిలకలగుట్టకు సమక్క చేరుకోవడంతో జాతర ముగిసింది. జాతర నేపథ్యంలో.. దేశం నలుమూలల నుంచి వచ్చిన జనం మొక్కులు చెల్లించారు. శనివారం సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెలపై నుంచి ఆదివాసీ పూజారులు వారి వారి ఆలయాలకు తీసుకెళ్లారు. సమ్మక్క ప్రతిరూపమైన కుంకుమభరిణెతో సాయంత్రం ప్రారంభమై సూర్యాస్తమయం తర్వాత పూజారులు రాత్రి 7.27 నిమిషాలకు వన ప్రవేశం చేయడంతో జాతర ముగిసింది.
‘మేడారం’ బందోబస్తుపై డీజీపీ సంతృప్తి అధికారులు, సిబ్బందికి అభినందనలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క -సారక్క ఉత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహిం చినందుకు పోలీసు అధికారులు, సిబ్బందికి రాష్ట్ర డీజీపీ డాక్టర్‌ రవి గుప్తా అభినందనలు తెలియజేశారు. 21 నుంచి 24 తేదీ వరకు సాగిన ఈ గిరిజన జాతరకు రాష్ట్రం నుంచే గాక దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారనీ, ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతలను ఏర్పాటు చేయటంలో పోలీసులు అనుసరించిన వ్యూహం మంచి ఫలితాలనిచ్చిందని ఆయన అన్నారు. ఐజీలు మొదలుకొని డీఐజీలు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు, హౌంగార్డుల వరకు ఈ జాతరను విజయవంతం చేయటానికి సమిష్టిగా చేసిన కృషి ఫలించిందని ఆయన కొనియాడారు. భక్తులను తీసుకొచ్చిన లక్షలాది వాహనాల కోసం పార్కింగ్‌ను కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేశారని డీజీపీ తెలిపారు. ఈ జాతర విజయవంతానికి ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయమై పోలీసులు అధికారులు, సిబ్బంది పని చేశారని చెప్పారు. ముఖ్యంగా, లక్షలాది మంది గిరిజనులు కూడా ఈ జాతర ఉత్సాహపూరితంగా, భక్తిమయంగా సాగటానికి పోలీసులకు చక్కటి సహకారాన్ని అందించారని ఆయన మెచ్చుకున్నారు.