– ఉస్మానియా ఆస్పత్రిలో కాలేయమార్పిడి విజయవంతం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కార్పొరేట్ ఆస్పత్రులకు ఏ మాత్రం తీసిపోని విధంగా రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రు ల్లోని వైద్యులు తమ ప్రతిభను, పనితీరును కనబరుస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రి డాక్టర్లు ఇప్పటికే ఎనిమిది మంది చిన్నారులతో పాటు 30 మందికి కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో చిన్నారికి చేసిన కాలేయ మార్పిడి చికిత్స కూడా జయప్రదమైంది.. అందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం కొండవనమాల గ్రామానికి చెందిన మోదుగు గుణశేఖర్, అమల దంపతుల కుమారుడు మాస్టర్ చోహన్ ఆదిత్య (3) పుట్టుకతోనే పిత్తాశయ ధమని, కాలేయ సమస్యతో బాధపడుతున్నాడు. ఆదిత్యను పరిశీలించిన ఉస్మానియా వైద్యులు మధుసూదన్ నేతృత్వంలోని సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, కాలేయ మార్పిడి బృందం ఈ నెల మూడో తేదీన అతడికి కాలేయ మార్పిడి చికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. అమల తన కాలేయాన్ని కుమారునికి దానం చేయడంతో కొంత భాగాన్ని తీసుకొని బాలునికి అమర్చారు. ప్రస్తుతం తల్లీకుమారులు క్షేమంగా ఉన్నారు. వారిని మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
మంత్రి అభినందనలు
కాలేయ మార్పిడిని విజయవంతంగా పూర్తి చేసిన వైద్యబందాన్ని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. ఉస్మానియా ఆస్పత్రి కార్పొరేట్ ఆస్పత్రుల తరహాలో వైద్య సేవలందిస్తున్నదని మంత్రి తెలిపారు.