స్నేహితులంతా కలిసి మైదానంలో ఆటలు ఆడుతున్నారు. ”అరేరు రిషి! నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నీకు ఏ విషయం పూర్తిగా తెలియదు. అటు చదువులేదు. ఇటు ఆటలు రావు. అన్నిట్లో తలదూర్చకు” అని ఎనిమిదో తరగతి చదువుతున్న కిట్టు తన స్నేహితుడు, క్లాస్‌మేట్ అయిన రిషిని హెచ్చరించాడు.
రిషి బాధతో తలదించుకొని మౌనంగా దూరంగా నిలబడిపోయాడు. తన స్నేహితులంతా రిషిని చూస్తూ ఎగతాళిగా నవ్వారు. ”నీకెందుకురా ఇవన్నీ.. వెళ్లి క్లాసులో ఏదో ఒక మూల కూర్చొని తెచ్చుకున్న లంచ్ బాక్స్ తిను” అని హేళనగా అన్నారు స్నేహితులందరూ.
రిషి ప్రతిరోజు పాఠశాలకు వెళ్లేవాడు. కానీ చదువుపైన శ్రద్ధ పెట్టేవాడు కాదు. ఆరోజు స్నేహితులు అన్న మాటలకు చాలా బాధపడ్డాడు. సాయంత్రం ఇంటి గంట మోగగానే బాధతో బ్యాగు భుజాన వేసుకొని బస్సెక్కి వెనక సీట్లో కూర్చున్నాడు. స్నేహితులంతా బస్సులో సీతాకోకచిలుకల్లా కేరింతలు కొడుతూ డాన్సులు చేస్తూ ఆనందంగా ఉన్నారు. రిషి మాత్రం మౌనంగా ఉండిపోయాడు. తన స్నేహితులు అన్న మాటలు పదేపదే గుర్తుకు వచ్చాయి. రిషి బస్సు దిగి ఇంట్లోకి వెళ్లి బ్యాగును మూలకు పడేసి తన బెడ్‌రూమ్‌లోకి వెళ్లి పడుకున్నాడు.
”ఎప్పుడు సంతోషంగా, ఉత్సాహంగా ఇంటికి వచ్చే రిషి ఈరోజు మౌనంగా బెడ్ రూమ్‌లోకి వెళ్ళాడు” అనుకుంది తల్లి మమత. ”అరేరు రిషి! టేబుల్ పైన పాలు పెట్టాను వచ్చి తాగు” అని వంట గదిలో పనిచేస్తున్న తల్లి అన్నది. రిషి నుండి ఎలాంటి సమాధానం రాలేదు. తల్లి బెడ్ రూమ్ లోకి వెళ్లి చూడగా రిషి వెక్కివెక్కి ఏడుస్తున్నాడు. ”ఏమైంది నాన్న అనగానే మరింత గుక్కపట్టి ఏడవసాసాడు. తల్లి ఓదార్చుతూ ”చెప్పు నాన్న.. ఏం జరిగింది? టీచర్స్ కొట్టారా?” అని అడగ్గానే తల అడ్డంగా ఊపాడు. ”ఏమైంది చెప్పు నాన్న..” అని బతిమిలాడగానే స్కూల్లో జరిగిన సంగతంతా చెప్పాడు రిషి.
తల్లికి విషయం అర్థమైంది. ‘రిషి కరోనాకు ముందు చాలా ఉత్సాహంగా ఉండేవాడు. చదువులో కూడా ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు. కరోనా వల్ల రెండు సంవత్సరాలు ఇంట్లో ఉండడంతో మొబైల్ చూడటం, దానిలో గేమ్స్ ఆడటం అలవాటు చేసుకున్నాడు. ఇంట్లో నుంచి బయటికి అడుగుపెట్టి స్నేహితులను కూడా కలవడం లేదు. స్కూళ్లు తెరిచాక కూడా ఇంటికి వచ్చి పుస్తకం పట్టి చదివిన దాఖలాలు లేవు. ఇంటికి రాగానే మొబైల్ పట్టుకొని ఆటలాడుతూ… టీవీలో సినిమాలు చూస్తూ గడుపుతున్నాడు. ”చదువుకోరా…” అని ఎంత చెప్పినా వినట్లేదు. ఒక్కగానొక్క కొడుకు కావడంతో కాసింత గారాబంగా పెంచాను. అందుకే ఇప్పుడు వీడు చదువులో, ఆటల్లో వెనుకబడ్డాడు’ అని మనసులోనే అనుకుంది తల్లి మమత.
”రిషీ.. మీ స్నేహితులంతా నిన్ను మెచ్చుకునేలా, టీచర్లు నిన్ను చూసి గర్వపడేలా చేస్తాను” అన్నది తల్లి. రిషి ఏడుపు ఆపేసి తల్లి వైపు ఆశ్చర్యంగా చూశాడు. ”నువ్వు విన్నది నిజమే. నేను చెప్పినట్లు వింటే నిన్ను అందరూ మెచ్చుకునేలా చేస్తాను” అన్నది తల్లి .
”అమ్మా నిజంగా నువ్వు అలా చేస్తానంటే నువ్వేం చెప్పినా వింటాను. కిట్టూ ముందు నేను కాలర్ ఎగరేసి తిరగాలి” అన్నాడు. ”అయితే ఒక షరతు!”
”ఏంటో చెప్పమ్మా..”
”ఒక రెండు నెలల పాటు నువ్వు ఇంటికి రాగానే మొబైల్‌లో గేమ్స్ ఆడటం, టీవీ చూడటం మానాలి” అన్నది తల్లి. కొంచెం కష్టమైనా.. రిషికి ఇష్టం లేకపోయినా..”సరే అమ్మా!” అన్నాడు.
ఆ రోజు నుండి రిషి స్కూల్ నుండి ఇంటికి రాగానే తల్లి చెప్పినట్లుగానే పుస్తకాలు తీసి చదవడం ప్రారంభించాడు. పుస్తకాలతోనే గడపడం మొదలుపెట్టాడు. కాసేపు విశ్రాంతి కోసం బయటికి వెళ్లి స్నేహితులతో కూడా ఆడుకునేవాడు. ఇలా రెండు నెలలపాటు రిషి కష్టపడి చదివాడు. స్కూల్లో జరిగిన పరీక్షల్లో మంచి మార్కులు సాధించాడు. ఆటల్లో కూడా ఉత్సాహంగా పాల్గొన్నాడు. రిషి స్నేహితులంతా మెచ్చుకున్నారు.
పాఠశాల నుండి సంతోషంగా ఇంటికి రాగానే ఇంట్లో కిట్టు ఉండటం చూసి కోపం వచ్చింది రిషికి. ”రా నాన్నా! మీ ఫ్రెండ్ నీ కోసం స్వీట్స్ తీసుకొచ్చాడు” అన్నది తల్లి. ”అమ్మా! వీడిని ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు? వీడి వల్లనే నాకు స్కూల్‌లో అవమానం జరిగింది” అన్నాడు రిషి.
అమ్మ, కిట్టు ఒక్కసారే నవ్వారు. రిషి ఆశ్చర్యపోయాడు. ”నువ్వు చదువు మీద శ్రద్ధ పెట్టడం లేదనీ.. నీ సామర్థ్యం నీకు తెలియచేయాలని కిట్టుతో అలా అనమని నేనే చెప్పాను. దీంట్లో కిట్టు తప్పు ఏమీ లేదు. నీ బాగుకోసమే కిట్టు అలా చేశాడు. నీకు ఇన్ని రోజులు దూరం ఉన్నాడు” అని రిషి వాళ్ళ అమ్మ అన్నది.
”కంగ్రాచ్యులేషన్స్ రా రిషి” అని స్వీట్‌ని ఇచ్చాడు కిట్టు. రిషి చాలా సంతోషించాడు. రిషిలో వచ్చిన మార్పుకు తల్లి చాలా సంతోషించింది. ”మా మంచి అమ్మ” అని తల్లిని హత్తుకున్నాడు రిషి.
– ముక్కామల జానకీరామ్, 6305393291