అప్పులు చేసి అన్నం పెడుతున్న అమ్మలు

Mothers who are paying for debt– ఆర్థిక కష్టాల్లో మధ్యాహ్న భోజన కార్మికులు
– ఐదు నెలలుగా వేతనాల్లేవ్‌..
– మార్కెట్‌లో పెరిగిన గుడ్లు, నిత్యావసరాల ధరలు
– రూ.5కే రెండు సార్లు గుడ్లు పెట్టాలనడం భావ్యమా..
– కనీస వేతనం రూ.26 వేలివ్వాలని డిమాండ్‌
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
‘మేం తిన్నా తినకపోయినా అప్పులు చేసి పిల్లలకు అన్నం పెడుతున్నాం. ఐదు నెలలుగా జీతాల్లేవు. రూ.5 ఇచ్చి వారానికి రెండు గుడ్లు పెట్టాలంటే ఎట్ట..? మార్కెట్లో కూరగాయలు, గ్యాస్‌, నూనెలు, పప్పులు, గుడ్ల ధరలు మండిపోతున్నాయి. అయినా పిల్లల కడుపు నింపుతన్నం. బిల్లులు సమయానికి రావట్లేదు. సర్కారిచ్చే రూ.3 వేలతో బతికేదెట్ల..? ఉచితంగా గ్యాస్‌ ఇవ్వాలి. కనీస వేతనం రూ.26 వేలివ్వాలి. ప్రమాద బీమా, పీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలేమీలేవు. కనీసం మేమెరమనేది చెప్పుకోడానికి గుర్తింపు కార్డులైనా ఇవ్వట్లేదు. గత ప్రభుత్వంలో ఎంతో కొట్లాడినం. ఈ ప్రభుత్వమైనా మా గోడు పట్టించుకోవాలి..’ ఇదీ..! మధ్యాహ్న భోజన కార్మికుల ఆవేదన.
పాఠశాల విద్యను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఆయా ప్రభుత్వాలు పలు పథకాల్ని అమలు చేస్తూ వస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు తాజాగా వండిన మధ్యాహ్న భోజనం, అల్పాహారం అందిస్తున్నారు. కేంద్ర, రాష్ట్రాల భాగస్వామ్యంతో అమలవుతున్న పథకమిది. తెలంగాణలోని ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 1615 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలున్నాయి. ప్రతి స్కూల్స్‌లో వంటలు వండి పెట్టే పనిని సమభావన గ్రూపుల్లోని మహిళా ఏజెన్నీలకు అప్పజెప్పారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు అల్పాహార పథకాన్ని కూడా ప్రారంభించింది. ఒక్కో పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను బట్టి ఇద్దరు ముగ్గురు చొప్పున మధ్యాహ్న భోజన కార్మకులున్నాయి. మూడు జిల్లాల్లో కలిపి 3500 మంది వరకు కార్మికులున్నారు. వీరికి ప్రభుత్వం గౌరవ వేతనంగా నెలకు రూ.వెయ్యి ఇచ్చేది. అనేక ఏండ్లు పోరాడిన ఫలితంగా మూడు వేలు ఇస్తోంది. అయితే, ఐదు నెలలుగా మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు ఇవ్వట్లేదు. పెంచిన వేతనమూ దక్కట్లేదు.
సంగారెడ్డి జిల్లాలో 1262 ప్రభుత్వ స్కూల్స్‌ ఉండగా.. వీటిల్లో 1.35 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మెదక్‌ జిల్లాలో 923 ప్రభుత్వ స్కూల్స్‌ ఉండగా, వీటిల్లో 85 వేల మంది, సిద్దిపేట జిల్లాలో 976 ప్రభుత్వ స్కూల్స్‌ ఉండగా 93 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ మధ్యాహ్న భోజన పథకం కింద ఒక్క పూట భోజనం అందిస్తున్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల ఏజెన్సీకి ప్రభుత్వం నుంచి ఉచిత బియ్యం సరఫరా చేస్తారు. కూరగాయలు, గుడ్లు, గ్యాస్‌ ఏజెన్సీ వాళ్లే కొనుగోలు చేసుకుని వంట వండి పెడుతున్నారు. అయితే, వారికి నెల నెలా రావాల్సిన బిల్లులు రావడం లేదు. నాలుగైదు నెలలకోసారి బిల్లులిస్తుండటంతో ఏజెన్సీ వాళ్లు భోజనానికి కావాల్సిన కూరగాయలు, పప్పులు, నూనెలు, గుడ్లు, గ్యాస్‌ను ఖాతా మీద కొనుగోలు చేస్తున్నారు. బిల్లులు సకాలంలో రాకపోవడంతో దుకాణాదారులు సరుకులివ్వట్లేదు. దీంతో ఏజెన్సీ వాళ్లు ప్రయివేట్‌గా అప్పులు తెచ్చి పిల్లలకు భోజనం పెడుతున్నారు. అప్పులకు వడ్డీ భారం పెరుగుతుండటంతో అనేక మంది మహిళా కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పెరుగుతున్న ధరల భారాలు
మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం మధ్యాహ్న భోజనం కోసం ఇస్తున్న బిల్లులు మాత్రం పెరగట్లేదు. ప్రస్తుతం మార్కెట్‌లో ఒక కోడి గుడ్డు ధర రూ.7 వరకు ఉంది. ప్రభుత్వం మాత్రం గుడ్డు ధర రూ.5 మాత్రమే చెల్లిస్తోంది. వారానికి ఒక గుడ్డు పైసలు రూ.5 మాత్రమే ఇస్తూ ఏజెన్సీలను మాత్రం రెండు గుడ్లు వండి పెట్టాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఐదు రూపాయలకు ఒక గుడ్డు రాని పరిస్థితి ఉంటే.. రెండు గుడ్లు ఎలా తెచ్చి పెట్టగలమని ఏజెన్సీ నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. కార్మికులకు కనీస వేతనం రూ.26వేలివ్వాలని ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. ఉద్యోగులుగా గుర్తించి.. ప్రమాద బీమా వర్తింపజేయాలని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. సబ్సీడీ గ్యాస్‌ ఏజెన్సీలకూ ఇవ్వాలని కోరుతున్నారు.
పెండింగ్‌ వేతనాలివ్వాలి: జి.సాయిలు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి
మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్‌ వేతనాలివ్వాలి. ఐదు నెలలుగా పెంచిన వేతనాలివ్వట్లేదు. కార్మికులకు కనీసం గుర్తింపు కార్డుల్విట్లేదు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి సదుపాయల్లేవు. కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నా ఎలాంటి బీమా సదుపాయం అందట్లేదు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం.