– మాంజా దారం మెడకు చుట్టుకొని సైనికుడు మృతి
– భవనంపై నుంచి పడి మరో యువకుడు దుర్మరణం
హైదరాబాద్-సిటీబ్యూరో
హైదరాబాద్‌లో దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి. సంక్రాంతి పండుగ వేళ ఎగుర వేస్తున్న పతంగులతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మాంజా దారం మెడకు చుట్టుకొని సైనికుడు మృతి చెందారు. గాలిపటం ఎగరేస్తూ భవనంపై నుంచి పడి యువకుడు దుర్మరణం చెందాడు. సైన్యంలో సేవలందిస్తున్న కోటేశ్వరరావు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. విధులు ముగించుకొని ఆయన ఇంటికి వెళ్తున్న సమయంలో లంగర్‌హౌస్‌పై వద్ద మెడకు మాంజా చుట్టుకుంది. దీంతో కోటేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలకు గురైన ఆయన పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. కోటేశ్వరరావు విశాఖపట్నంకు చెందినవాడు.యువకుడు బిల్డింగ్‌పై నుంచి కిందపడి తీవ్ర గాయాలతో రక్తస్రావం అయ్యి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన అల్వాల్‌లో చోటు చేసుకుంది. చనిపోయిన యువకుడు పేట్ బషీర్‌బాగ్ పోలీస్ స్టేషన్ ఏఎస్‌ఐ కుమారుడు ఆకాశ్‌గా గుర్తించారు. ఈ సంఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పతంగుల కారణంగా గత రెండురోజుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పండుగ వేళ మృతుల కుటుంబాల్లో విషాదం అలుముకున్నది. మాంజాదారంపై నిషేధం ఉన్నా నిబంధనలకు విరుద్ధంగా పలువురు విక్రయిస్తున్నారు. పతంగులను ఎగురవేస్తూ ఇష్టారాజ్యంగా వదిలివేస్తుండడంతో మాంజాదారంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే, పక్షులు సైతం బలవుతున్నాయని పలువురు ఆవేదన చెందుతున్నారు.
హై టెన్షన్ వైర్లకు చిక్కుకున్న గాలిపటాన్ని తీస్తూ ..
జోగిపేట : హైటెన్షన్ వైర్లకు చిక్కుకున్న గాలిపటాన్ని తీసే ప్రయత్నంలో విద్యుద్ఘాతానికి గునై ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని జోగిపేట పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. పటాన్‌చెరు మండలంలోని ఇస్నాపూర్ ప్రాంతంలో గల ఓ పార్మా కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం(35) సంక్రాంతి పండుగ సందర్భంగా భార్య, పిల్లలతో కలిసి జోగిపేటలో నివాసముంటున్న మామ ప్రసాద్ ఇంటికి వచ్చారు. ఆదివారం ఉదయాన్నే బిల్డింగ్‌పై పిల్లలతో కలిసి గాలిపటాలు ఎగురవేసి అందరూ ఆనందంగా గడిపారు. పిల్లలు ఎగురవేస్తున్న గాలిపటం బిల్డింగ్‌కు సమీపంలో ఉన్న హై టెన్షన్ వైర్లకు తగిలింది. ఈ క్రమంలో ఆ వైర్ల నుంచి గాలిపటాన్ని తీయడానికి సుబ్రహ్మణ్యం ప్రయత్నించగా.. ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలింది. దాంతో అతడు రెండంతస్తుల భవనం పైనుంచి కిందపడిపోగా.. తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను ముందుగా స్థానిక జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడినుంచి సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. కాగా భర్తను కాపాడబోయే క్రమంలో మృతుని భార్య చాముండేశ్వరికి గాయాలయ్యాయి. అలాగే వారి ఓ కుమారుడికి కూడా గాయాలు అయ్యాయి. మృతుడి స్వస్థలం కృష్ణాజిల్లా గుడివాడ ప్రాంతం.