మెటల్‌ రోడ్డుతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

– పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు
నవతెలంగాణ-టేకులపల్లి
మండల కేంద్రం నుండి బోడు పరిసర ప్రాంతాలకు వెళ్లడానికి పెట్రాంచేలక స్టేజి నుండి కారేపల్లి తండా వరకు విఎస్‌ఆర్‌కె కాంట్రాక్టర్‌ రోడ్డు టెండర్‌ దక్కించుకున్నారు. దీంతో రోడ్డు తవ్వి కంకర పరిచారు. బీటీ రోడ్డు వేయడానికి సిద్ధం చేసి రోడ్డు పై తారుపోయడం ఆపారు. దీంతో నిత్యం ఈ మార్గం గుండా ప్రజలు ప్రయాణిస్తూ ఉంటారు. కనీసం రోడ్డుపై నీళ్లు కూడా చల్లకపోవడంతో దుమ్ము లేచి పక్కనున్న పంట పొలాలపై పడి పంటలు నాశనం అవుతున్నాయని ప్రజలు అంటున్నారు. వాహనాల రాకపోకల వల్లన దుమ్ము లేవడంతో వెనక వచ్చే వాహనాలు కనపడకపోవడం, ఎదురెదురుగా వాహనాలు ఢకొీంటున్నాయని, కంకర రోడ్డుపై తేలడంతో వాహనదారులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని, ద్విచక్ర వాహనదారులైతే కిందపడి గాయాల పాలవుతున్నారని పెద్ద పెద్ద వాహనాలు వెళ్తున్నప్పుడు ప్రజలు ఆ రోడ్డుపై వెళ్లాలంటే భయపడుతున్నారని, కంకర లేచి తగిలితే గాయాల పాలవుతాయని భయపడుతున్నామంటున్నారు. నిత్యం రద్దీగా ఉండే రహదారిని సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. గుండాల మండల ప్రజలు భద్రాద్రి జిల్లా కేంద్రానికి వెళ్లడానికి ఈ దారి గుండానే వెళ్తారని, త్వరలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆరంభం కానున్నదని. చాలా మంది భక్తులు ఈ మార్గం గుండా ప్రయాణం చేస్తారని, ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి రోడ్డుపై తారు వేసి ప్రజల కష్టాలు తీర్చవలసిందిగా కోరుతున్నారు.