ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన రోజురోజుకూ అందరిలో పెరిగి పోతోంది. అందుకే తీసుకునే ఆహారంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో మాదిరిగా ఏది పడితే అది తినకుండా సాధ్యమైనంత వరకు మంచి ఆహారంపై దృష్టి పెడుతున్నారు. అందులో తృణధాన్యాలకు మరింత ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే వీటిని తినడానికి అందరూ అంతగా ఇష్టపడరు. అందుకే కాస్త వెరైటీగా చేసుకుంటే చూసేందుకు, తినేందుకు కూడా బాగుంటుంది. ఊదలతో చేసే అలాంటి కొన్ని వెరైటీ రుచలను తెలుసుకుందాం…
ఉప్మా
కావాల్సిన పదార్ధాలు : ఊదలు – కప్పు, తరిగిన పచ్చి మిర్చి – ఐదు, నెయ్యి – చెంచా, కరివేపాకు పొడి – చెంచా, ఉప్పు – తగినంత, కూరగాయ ముక్కలు – ఒక కప్పు (క్యారట్, బీన్స్, క్యాలీఫ్లవర్, పచ్చి బఠాణీ అన్నీ కలిపి), జీలకర్ర – చెంచా, నీళ్లు – అర కప్పు, ఇంగువ – పావు చెంచా, కొత్తిమీర – తగినంత.
తయారు చేసే విధానం : ఊదలను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి సుమారు గంట సేపు నానబెట్టాలి. స్టౌ మీద కుక్కర్‌లో నెయ్యి వేసి పూర్తిగా కరిగిన తర్వాత జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి. కూరగాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి జత చేసి మరోమారు కలియబెట్టాలి. కరివేపాకు పొడి వేసి బాగా కలపాలి. ఊదలలో నీటిని ఒంపేసి, మరుగుతున్న నీళ్లలో ఊదలు, ఉప్పు వేసి బాగా కలిపి మూత ఉంచాలి. రెండు విజిల్స్ వచ్చాక దింపేయాలి. మూత తీశాక కొద్దిగా నెయ్యి, కొత్తిమీర వేసి వేడివేడిగా తినాలి.
ఊదల కట్‌లెట్
కావాల్సిన పదార్ధాలు : ఊదల పిండి – కప్పు, బఠాణీ – పావు కప్పు, ధనియాల పొడి – చెంచా, కంద ముక్కలు – పావు కప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద – రెండు చెంచాలు, జీలకర్ర పొడి – చెంచా, కారం – అర చెంచా, మిరియాల పొడి – అర చెంచా, జీడి పప్పు పలుకులు – పది, కొత్తిమీర తరుగు – రెండు చెంచాలు, వాము – చెంచా, ఉప్పు – తగినంత, నువ్వుల పొడి – రెండు చెంచాలు, నెయ్యి – తగినంత, నిమ్మ రసం – చెంచా.
తయారు చేసే విధానం : కంద ముక్కలు, బఠాణీలను విడివిడిగా ఉడికించి, చేతితో మెత్తగా చిదిమి పక్కన ఉంచాలి. స్టౌ మీద కడాయిలో నెయ్యి కాగాక ఊదల పిండి వేసి దోరగా వేయించి చల్లారనివ్వాలి. ఒక గిన్నెలో ఊదల పిండి, మెత్తగా మెదిపిన కంద, బఠాణీ ముద్ద వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. కలుపుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వాము, కొత్తిమీర తరుగు, ఉప్పు, నిమ్మ రసం ఒకదాని తరవాత ఒకటి వేసి కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, కట్‌లెట్‌లాగ ఒత్తి, నువ్వుల పొడిలో ముంచి పక్కన ఉంచాలి. స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక, నూనె వేసి కాగాక తయారుచేసి ఉంచుకున్న కట్‌లెట్‌లను పెనం మీద వేసి రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. జీడి పప్పులతో అలంకరించి వేడివేడిగా తినాలి.
ఊదల పిజ్జా
కావాల్సిన పదార్ధాలు : ఊదలు – అర కప్పు, నెయ్యి/ నూనె – రెండు చెంచాలు, గోధుమ పిండి – అర కప్పు, ఉల్లి తరుగు, క్యాప్సికమ్ తరుగు, టమాటా ముక్కలు, మష్రూమ్ తరుగు – అర కప్పు, బేకింగ్ పౌడర్ – అర చెంచా, టమాటా సాస్ – పావు కప్పు, మొజెల్లా చీజ్ – తగినంత, స్వీట్ కార్న్ గింజలు – చెంచా, ఉప్పు – తగినంత.
తయారు చేసే విధానం : ఊదలను శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి సుమారు రెండు గంటలసేపు నానబెట్టాక, నీళ్లు ఒంపేయాలి. వీటిని గ్రైండర్‌లో వేసి మెత్తటి పిండిలా రుబ్బి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గోధుమ పిండి, ఉప్పు, బేకింగ్ సోడా జత చేసి బాగా కలిపి సుమారు ఆరు గంటల పాటు పులియ బెట్టాలి. స్టౌ మీద పాన్ పెట్టి వేడి చేయాలి. కొద్దిగా నూనె వేసి కాగాక, పులియబెట్టిన పిండిని ఒక గరిటెడు తీసుకుని పెనం మీద వేసి రెండు వైపులా కాలిస్తే, పిజ్జా బేస్ సిద్ధమైనట్లే. 180 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర ఓవెన్‌ను ఐదు నిమిషాల పాటు వేడి చేయాలి. బేకింగ్ ట్రేలో అల్యూమినియం ఫాయిల్ పేపర్ వేసి, తయారు చేసి ఉంచుకున్న పిజ్జా బేస్‌ను ట్రేలో ఉంచాలి. టమాటా సాస్, మొజెల్లా చీజ్, టమాటో తరుగు, ఉల్లి తరుగు, క్యాప్సికమ్ తరుగు, మష్రూమ్ తరుగు, స్వీట్ కార్న్ గింజలు ఒక దాని మీద ఒకటి వేయాలి. సుమారు పది నిమిషాలు దీనిని బేక్ చేసి బయటకు తీయాలి. వేడివేడిగా తింటే రుచిగా ఉంటుంది..
ఊదల పుదీనా అన్నం
కావాల్సిన పదార్ధాలు : ఊదలు – ఒక కప్పు, నెయ్యి లేదా నూనె – రెండు టీ స్పూన్లు, ఉల్లి తరుగు – పావు కప్పు, టమాటా ముక్కలు – అర కప్పు, నీళ్లు – రెండు కప్పులు, బిర్యానీ ఆకు – ఒకటి, కరివేపాకు – రెండు రెబ్బలు, ఉప్పు – తగినంత, తరిగిన పచ్చి మిర్చి – రెండు, క్యారట్ తరుగు – ఒక కప్పు, కొత్తిమీర – పావు కప్పు, పుదీనా – ఒక కప్పు, లవంగాలు – రెండు, అల్లం, వెల్లుల్లి తరుగు – అర చెంచా.
తయారు చేసే విధానం : ఊదలను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి సుమారు రెండు గంటల సేపు నానబెట్టి, నీళ్లు ఒంపేయాలి. స్టౌ మీద కుక్కర్‌లో ఊదలు, నీళ్లు, ఉప్పు, బిర్యానీ ఆకు వేసి కుక్కర్ మూత పెట్టాలి. మంటను కొద్దిగా తగ్గించి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. పుదీనా ఆకును శుభ్రంగా కడిగి, కొద్దిగా నీళ్లు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. స్టౌ మీద కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి కరిగాక లవంగాలు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు ఒకదాని తర్వాత ఒకటి వేసి దోరగా వేయించాలి. ఉల్లి తరుగు జత చేసి మరోమారు వేయించాలి. టమాటా ముక్కలు, క్యారట్ తరుగు, కరివేపాకు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. పుదీనా ముద్ద వేసి బాగా కలిపి, కొద్దిసేపు ఉడికించాలి. చివరగా ఉప్పు వేసి కలియబెట్టి దింపేయాలి. ఒక పెద్ద పాత్రలో ఉడికించిన ఊదలు, వేయించి ఉంచుకున్న పుదీనా మిశ్రమం వేసి బాగా కలియబెట్టాలి. కొత్తిమీరతో అలంకరించాలి. రైతాతో వడ్డిస్తే చాలా రుచిగా ఉంటుంది.