అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు

– సీఐటీయూ మండల అధ్యక్షుడు కుమారస్వామి

– అర్థరాత్రి జీపీ కార్మికుల అరెస్టు- విడుదల 
నవతెలంగాణ పెద్దవంగర:
అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని గ్రామపంచాయతీ కార్మిక సంఘం జేఏసీ మండల కన్వీనర్, సీఐటీయూ మండల అధ్యక్షుడు కసరబోయిన కుమారస్వామి అన్నారు. జీపీ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, జీవో 51 రద్దు  తదితర డిమాండ్లపై కార్మికులు సుమారు  నెల రోజులుగా సమ్మె చేయడం తెలిసిందే. ఈ సమ్మెలో భాగంగా నేడు ఛలో మంత్రి ఎర్రబెల్లి క్యాంపు కార్యాలయం పాలకుర్తి ముట్టడికి జీపీ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి జీపీ కార్మిక సంఘాల నాయకులను  అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై నాయకులను విడుదల చేశారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. జీపీ కార్మిక సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. ఈ అక్రమ అరెస్టుల ద్వారా ఉద్యమాన్ని ఆపలేరని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలన్నారు. అరెస్ట్ అయిన వారిలో గిరగాని రామస్వామి, చేత పరుశరాములు, కోట శ్రీకాంత్, తొగరు మధుకర్, ఎండీ పాషా, కాసాని అశోక్, పాల వెంకటసోములు, జాటోత్ సుమన్, రవి, సతీష్, ఎడవల్లి ఎల్లప్పా తదితరులు ఉన్నారు.