నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మోడీ విధానాల వల్ల భారత రాజ్యాంగం ప్రమాదంలో పడ్డదనీ, దాని రక్షణకు బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఏర్పడిందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో అఖిల భారత దళిత హక్కుల ఉద్యమం (ఏఐడీఆర్‌ఎం) జాతీయ సమితి సమావేశాల నేపథ్యంలో దళిత హక్కుల పోరాట సమితి(డీహెచ్‌పీఎస్) ఆధ్వర్యంలో ”మనువాదం-దళితులు-రాజ్యాంగం” అనే అంశంపై సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ మనువాద సిద్ధాంతాన్ని అమల చేయాలని ప్రయత్నిస్తే.. తాము ఎంతటికైనా తెగిస్తామనీ, మతోన్మాదాన్ని బొంద పెట్టేందుకు అవసరమైన త్యాగాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. దళితుల కులగణన చేపట్టాలనీ, జనాభా ప్రతిపాదకన వారికి రిజర్వేషన్లను పెంచాలని డిమాండ్ చేశారు. బడ్జెట్‌లో అందుకు వీలుగా నిధులను కేటాయించాలని కోరారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినప్పటికీ దళితులకు న్యాయం జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ హక్కుల అమలు కోసం చర్చించాల్సిన పరిస్థితులకు నేడు ఎందుకొచ్చాయని ప్రశ్నించారు. ప్రజల కోసం పని చేయాల్సిన ప్రభుత్వం, పేదల బతుకులను బజారున పడేస్తున్నదని చెప్పారు. పాలకులు మారుతున్నప్పటికీ పేదరికం పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు , నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగినా వాటిని పట్టించుకునే పరిస్థితుల్లో వారు లేరని విమర్శించారు. పోరాటం ద్వారానే హక్కులను సాధించుకోగలుగుతామని చాడ గుర్తు చేశారు. ఏఐడీఆర్‌ఎం జాతీయ అధ్యక్షులు రామ్మూర్తి మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దళితులకు హక్కులను కల్పించిందన్నారు. అంటరానితనం లేదని అది స్పష్టం చేసిందని వివరించారు. మనుధర్మంలో నాలుగు వర్ణాలుగా విభజించారనీ, ఇందులో దళితులను అంటరానివారిగా చూశారని వివరించారు. ఏఐడీఆర్‌ఎం ప్రధాన కార్యదర్శి నిర్మల్ కుమార్ మాట్లాడుతూ మను ధర్మాన్ని పాటించటమంటే భారత రాజ్యాంగాన్ని విస్మరించటమేనని గుర్తు చేశారు.
అప్పుడు పౌర హక్కులకే బంగం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సదస్సుకు దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బందెల నర్సయ్య అధ్యక్షత వహించగా ఏఐడీఆర్‌ఎం జాతీయ కోశాధికారి దేవి కుమారి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాలనర్సింహ, డీహెచ్‌పీఎస్ గౌరవ అధ్యక్షులు ఎ.ఏసురత్నం, వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్, రాష్ట్ర నేత రత్నకుమారి , తెలంగాణ ప్రజా నాట్య మండలి ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ తదితరులు హాజరయ్యారు.