అది టూరిస్టు బస్సూ కాదు, వాళ్ళు టూరిస్టులంతకంటే కాదు. ‘సింగరేణి పరిరక్షణ యాత్ర’ లక్ష్యం దానిని కాపాడుకోవడం ఒక్కటే కాదు. బొగ్గు బ్లాకులను వేలం వేస్తే, అక్షరాల సింగరేణిని ‘కరిమింగిన వెలగపండు’లా మిగిలితే ముందు ఆ కార్మికులకు జరిగే నష్టం, మన తెలంగాణకు జరిగే నష్టం వివరించడం ఒకటికాగా, దానికి కారణమైన కేంద్ర ప్రభుత్వ విధానాలను, దానికి వంతపాడే గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను అర్థం చేయించడం మరో కీలక లక్ష్యం. ఆ విధానాలను వ్యతిరేకించి ఓడించకుండా కార్మికుల రోజువారీ సమస్యలు సైతం పరిష్కారం కావడం కష్టమనే అంశాన్ని అర్థం చేయించడం కీలక విషయం. అప్పుడేకదా మోీ సర్కార్ ఎటు నడుస్తుందో, దేశాన్ని ఏ కార్పొరేట్ భోషాణాల లాబీల్లోకి తీసుకుని పోతోందో కార్మికులకు, సాధారణ ప్రజలకు అర్థమయ్యేది.
”అందరూ శ్రీ వైష్ణవులే.. మధ్యలో రొయ్యల బుట్ట మాత్రం మాయమైంద”న్నట్టు ప్రస్తుత తెలంగాణ రాజకీయం నడుస్తోంది. ”మా సింగరేణిని ప్రయివేటీకరించవద్దని” కేసీఆర్ అంటాడు. రేవంత్‌రెడ్డి సర్కారూ అదే పల్లవి అందుకుంటుంది. ఆశ్చర్యకరంగా మోడీ ”సింగరేణిని ప్రయివేటీకరించం” అంటాడు. మరి, వారి వారి అస్మదీయులకు వేలంపాటలో కట్టబెట్టిందీ, కట్టబెడుతోంది ఎవరు? ఈ పని దేశవ్యాప్తంగా చేసేదెవరు? దేశవ్యాప్తంగా ఉన్న 500పై చిలుకు బొగ్గు బావుల్లో 300 ఇప్పటికే వేలం పాటలో ఇచ్చేశాం అని మొన్ననే కేంద్ర గనుల మంత్రి సర్వశ్రీ కిషన్‌రెడ్డి చెప్పగా విన్నవారు విస్తుపోయారు. పైగా దానివల్ల రాష్ట్రాల రెవెన్యూ పెరుగుతుందని మరో చౌకబారు వాదన చేశారు. ఆయన చెప్పిన వేల కోట్ల రూపాయల ఆదాయం ఏ రాష్ట్రానికి పెరిగిందో చెప్పి ఉంటే సంతోషించేవారం. అంటే తవ్వే బొగ్గులో రాష్ట్ర ప్రభుత్వానికి ”రెవెన్యూ షేరింగ్” ద్వారా వచ్చే ఆదాయం, అంటే 30 ఏండ్లపాటు రానున్న ఆదాయం గురించి మన బొగ్గు శాఖామాత్యులవారు సెలవిచ్చేది!
పాలకులు, వారి యజమానులు ఎప్పటికప్పుడు వచ్చే విమర్శలనుబట్టీ తమ విధానాలను సరిచేసుకుంటూ ముందుకు పోతారనేందుకు మోడీనే పెద్ద ఉదాహరణ. మన్మోహన్ సర్కార్ పూర్తిగా బద్నామ్ అయ్యింది ”కోల్ గేట్” కుంభకోణం తోనే. ఇప్పుడున్న పెట్టుబడిదారుల బృందాలన్నీ ఆనాడున్నాయి. థర్మల్ స్టేషన్లను అనుమతించి, దానికవసరమైన బొగ్గు తవ్వుకునేందుకు క్యాప్టివ్ మైన్స్ ఇచ్చారు. దేశంలోని కోల్‌మైన్స్ చట్టాన్ని సవరించకుండానే ఇష్టారాజ్యంగా బొగ్గుతవ్వుకున్నారు. మన్మోహన్ సర్కార్‌కు ఒళ్ళంతా మసి అంటింది.
నేడు కోల్ బేరింగ్ ఏియాస్ (అక్విజిషన్ అండ్ డెవలప్‌మెంట్) యాక్ట్ (1957)ను సవరించారు. కోకింగ్ కోల్‌మైన్స్ (నేషనలైజేషన్ యాక్ట్ 1972), కోల్‌మైన్ నేషనలైజేషన్ యాక్ట్ (1973) సవరించారు. సమస్య ఏమంటే పార్లమెంటులో ఈ సవరణలు పాస్ చేసుకునే సమయంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు ఏ పక్క నిల్చుని ఉన్నారు? దీనిపై ఆ పార్టీల విధానమేమిటి? సింగరేణి గురించి బట్టలు చించుకుంటూ మాట్లాడే ఈ రెండు పార్టీల నేతలు దీనికి సమాధానం సింగరేణి కార్మికులకు, రాష్ట్ర ప్రజలకు వివరణిస్తే తెలంగాణ సమాజం సంతోషిస్తుంది.
కొత్తగా నిర్మిస్తున్న యదాద్రి పవర్ ప్లాంట్ తప్ప మన రాష్ట్రంలోని థర్మల్ స్టేషన్లన్నీ దాదాపు పిట్‌హెడ్ స్టేషన్లే (బొగ్గు బావి సమీపంలోని పవర్‌ప్లాంట్లే). బొగ్గు రవాణా ఖర్చు తక్కువ. విద్యుదుత్పత్తి చౌక. రాష్ట్ర ప్రజానీకానికి చౌకైన విద్యుత్ అందించడంలో సింగరేణి పాత్ర కీలకం. ఒకసారి వేలంలో పాడుకున్న వ్యక్తి లేదా సంస్థ బొగ్గు తవ్వుతారో లేదో తెలీదు. తవ్విన బొగ్గు ఇక్కడే అమ్మాలనే రూల్ లేదు. అమ్మినా సింగరేణిచ్చిన రేటుకే ఇస్తారనే గ్యారంటీ లేదు. ఇన్ని ‘ఇఫ్’లు, ‘బట్’ల మధ్య రాష్ట్ర విద్యుత్‌రంగం దెబ్బతింటూంటే దానికి సింగరేణి బొగ్గు బ్లాకుల వేలమే కారణం.
దాదాపు బూర్జువా పార్టీలన్నీ ఏకోన్ముఖంగా బొగ్గు బ్లాకుల వేలం పాటకు ‘సై’ అంటున్నాయి. వారి కార్మిక సంఘాల నాయకత్వం వారి పార్టీల వైఖరి తప్పని తెల్సినా, వారి మాట జవదాటలేరు. అయితే ఇక్కడ సమస్య పార్టీలదీ కాదు, యూనియన్ నాయకులదీ కాదు. సమస్య తెలంగాణ అస్థిత్వానిది. నాలుగు కోట్ల ప్రజల జీవితాలకి సంబంధించినది. ఒకరి జెండా ఒకరు మోయాల్సిన అవసరం లేదు. ఏ సంఘం, ఏ పార్టీ జెండా వారే ఎత్తుకుని రంగంలోకి దూకాల్సిన సమయమిది.
సకల జనుల సమ్మెతో రోజుల తరబడి రాష్ట్రాన్ని స్తంభింపజేసి 29వ రాష్ట్ర ఏర్పాటుకు బాటలు పరిచిన కార్మికవర్గం, నేడు తెలంగాణ పునాదులనే పెకలించచూస్తున్న పాలకులపై తిరగబడలేమా? సింగరేణిని కాపాడుకుంటే అది అంతటితో ఆగదు. నేషనల్ మోనిటైజేషన్ పైప్‌లైన్ బద్దల తుంది. పాలకులు చెప్పే మాటలకు, చేతలకు పొంతన లేదన్న విషయం బహిర్గతమవుతుంది. అదే జరిగితే బస్సు యాత్ర సఫలమైనట్టే లెక్క.