గ్యాస్‌ సిలిండర్‌లో గంజాయి తరలింపు

గ్యాస్‌ సిలిండర్‌లో గంజాయి తరలింపు– 65 కేజీల గంజాయి స్వాధీనం
నవతెలంగాణ – కుత్బుల్లాపూర్‌
మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసులు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ కొత్త పద్ధతుల ద్వారా వాటిని నేరగాళ్లు రవాణా చేస్తున్నారు. తొలిసారిగా సీఎన్‌జీ సిలిండర్లలో గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా మేడ్చల్‌ ఎస్‌ఓటీ పోలీసులకు చిక్కడం కలకలం రేపుతుంది. ఈ తరహాలో గంజాయి రవాణా చేస్తూ పట్టుబడటం దేశంలోనే మొదటిసారి అని పోలీసులు చెబుతున్నారు.
మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్‌ పేట్‌ బషీరాబాద్‌ డీసీపీ కార్యాలయంలో శుక్రవారం మేడ్చల్‌ డీసీపీ నితిక పంత్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు కార్లలో గ్యాస్‌ సిలిండర్లలో నలుగురు నిందితులు గంజాయి నింపి తరలిస్తున్నట్టు తెలిపారు. మేడ్చల్‌ జాతీయ రహదారిపై తనిఖీలు చేస్తున్న పోలీసులు రెండు కార్లను ఆపి చూడగా.. గంజాయి లభ్యమైందన్నారు. అభిషేక్‌ తోమర్‌, అరవింద్‌ చౌదరి, ఆశిష్‌ కుష్వాన, ఆకాష్‌ సోలంకికి అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి నుంచి 65 కేజీల గంజాయి, రెండు కార్లు, 6 సెల్‌ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.