– పాలస్తీనా విదేశాంగ శాఖ విమర్శ
గాజా: సెటిల్‌మెంట్లను ఏర్పాటు చేసుకునే లక్ష్యంతో గాజాను మొత్తంగా ఆక్రమించుకుని తన స్వాధీనంలోకి తెచ్చుకునే లక్ష్యంతోనే ఇజ్రాయిల్ ఇలా ఊచకోతలకు పాల్పడుతోందని పాలస్తీనా విదేశాంగ శాఖ విమర్శించింది. అందులో భాగంగానే ఉత్తర గాజా నుండి పాలస్తీనియన్లును ఖాళీ చేయా ల్సిందిగా ఆదేశాలు జారీ చేసిందని పేర్కొంది. గాజాను మూడు భాగాలుగా విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించింది. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో ఉద్రికత్తలు రెచ్చగొట్టడమే లక్ష్యంగా తన వనరులన్నింటినీ సమీకరించు కుంటోందని పేర్కొంది. పాలస్తీనా నేషనల్ అథారిటీని పడదోసి, ఆక్రమణల కు పాల్పడ్డమే వారి లక్ష్యంగా వుందని విమర్శించింది. పాలస్తీనా దేశం ఏర్పడకుండా నివారించాలనే ఒకే ఒక్క నినాదంతో వారు పనిచేస్తున్నారని విమర్శించింది. ఇలా జాతుల మధ్య ఘర్షణలు రెచ్చగొట్టడం, బలవంతంగా ప్రజలను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేయడం వంటి చర్యలకు అడ్డుకట్ట వేయడంలో అంతర్జాతీయ సమాజం విఫలమైందని విమర్శించింది. గాజా, వెస్ట్ బ్యాంక్‌ల్లో తన వలసవాద విధానాలను అమలు చేసేందుకు ఇజ్రాయిల్ ప్రయత్నిస్తోందని పాలస్తీనా విదేశాంగ శాఖ విమర్శించింది. ఇదిలావుండగా, గాజాలో ఒక ఇంటిపై జరిగిన దాడిలో నలుగురు చిన్నారులతో సహా 11 మంది మరణించారు. ఇప్పటివరకు గాజాలో 41,182మంది మరణించగా, 95,280మంది గాయపడ్డారు. 12 రోజుల పాటు సాగిన మొదటి దశ పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముగిసింది. దాదాపు 5,60,000మంది చిన్నారులు మొదటి డోస్‌ను తీసుకున్నారు.