– కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి
నవతెలంగాణ-సూర్యాపేట
దళితుల హక్కుల పరిరక్షణ, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడేది కేవీపీఎస్ అని, కెవిపిఎస్ 25 ఏళ్ల పోరాట స్ఫూర్తితో అంబేద్కర్ రచించిన రాజ్యాంగ రక్షణకు ఐక్యంగా ఉద్యమించాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి పిలుపునిచ్చారు. కెవిపిఎస్ 25 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక మినీ ట్యాంక్ బండ్ దగ్గర ఆ సంఘం జెండాను ఆవిష్కరించి 25 ఏండ్ల సూచికగా 25 బ్లూ బెలూన్లను ఎగురవేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజాభివద్ధికి తరతరాల నుండి శ్రమను దారపోస్తున్న దళితులు నేటికీ అమానుషమైన అంటరానితనం, కులవివక్ష అత్యాచారాలు, అణిచివేతలకు సాంఘిక బహిష్కరణలకు గురవుతున్నారన్నారు. భూమి,నీరు, సంపద,బడ్జెట్ అభివద్ధిలో వాటా దక్కక కడు పేదలుగానే ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు.దళితుల సామాజిక సాధన కోసం 1998 అక్టోబర్ 2న ఏర్పడిన కేవీపీఎస్ ఈ 25 ఏండ్ల పాటు దళితులు ఎదుర్కొంటున్న కుల వివక్ష, అంటరానితనం కు వ్యతిరేకంగా దేవాలయ ప్రవేశం, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్, నోడల్ ఏజెన్సీ, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్,దళితులకు స్మశాన వాటికలకు స్థలం, దళితులకు ఉచిత విద్యుత్తు లాంటి అనేక సమస్యలపై పోరాటాలు నిర్వహించి విజయాలు సాధించిందన్నారు. సామాజిక ఆర్థిక సమానత్వం సాధించాలని విశాల ఐక్యత ద్వారా కుల వివక్షను నిర్మూలించి అంతిమంగా కుల వ్యవస్థనే నిర్మూలించాలనే లక్ష్యంతో పోరాడుతున్నదన్నారు .ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తొలగించాలని కుట్ర చేస్తున్న మనువాద పాలకులకు వ్యతిరేకంగా దళితులందరూ ఐక్యంగా ఉద్యమాలు నిర్వహించాలన్నారు.జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈ నెల 9వ తేదీ వరకు వాడవాడలా సంఘం 25వ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుతామ న్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఇరుగు రమణ,సుందర్,విజరు, వెంకటేశ్వర్లు,తిరుపతిరావు, సాయికిరణ్, సాయిరాం, మహేష్,చంటి,వంశీ, వెంకటేష్, గోపి,క్రాంతి,దాసు, శిరీష,త్రివేణి,కావ్య,అఖిల, వినీషా తదితరులు పాల్గొన్నారు.