ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలి

 Adilabad– ఆదిలాబాద్‌లో హైడ్రా చేపట్టాలి
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్‌
– పార్టీ జెండా ఆవిష్కరించి.. మహాసభలు ప్రారంభం
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ టౌన్‌
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ శ్రేణులు ఉద్యమించాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్‌, పార్టీ సీనియర్‌ నాయకులు బండి దత్తాత్రి పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని రణదీవెనగర్‌లో సీపీఎం పార్టీ శాఖ మహాసభలకు వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ముందుగా సీపీఎం పార్టీ సీనియర్‌ నాయకులు బండి దత్తాత్రి జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్‌ మహాసభలను ప్రారంభిస్తు పార్టీ కర్తవ్యాలను వివరించారు. ఈ సందర్భగా వారు మాట్లాడుతూ మూడేళ్లకు ఒక్కసారి జరిగే మహాసభలు గత కార్యక్రమాలను, సమీక్షించి భవిష్యత్తు మూడు సంవత్సరాల కాలంలో చేయబోయే కర్తవ్యాలను రూపొందిస్తారని అన్నారు. కేంద్రంలో నేడు అధికారంలో ఉన్న బీజేపీ ప్రజాసమస్యలు గాలికి వదిలేసిందన్నారు. ప్రజల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుతుందన్నారని మండిపడ్డారు.దేశంలో పేదరికం రోజు రోజుకు పెరుగుతున్నా అరికట్టడంలో విఫలమైందని దుయ్యబట్టారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు లాభాలు చేకూర్చిందన్నారు. నల్ల డబ్బును వెలికితీసి పేదల ఖాతాలో వేస్తానన్న హామీ నీటి మీది రాతగా మిగిలిపోయిందని అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతు రుణమాఫీ వందశాతం పూర్తి చేయాలని, ఇతర ఆరు గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని అన్నారు. హైదరాబాద్‌ లో ఏర్పాటు చేసిన హైడ్రా ను ఆదిలాబాద్‌లో కూడా ఏర్పాటు చేయాలన్నారు. చెరువులు, కుంటలు, నాలాలతో పాటు ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ భూములు కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఆర్‌.మంజుల, శాఖ కార్యదర్శులు లంక జమున, కోవ శకుంతల, ప్రజాసంఘాల నాయకులు ఆర్‌.సురేందర్‌, అగ్గిమల్ల స్వామి, టీ.సురేష్‌, విజయ, లక్ష్మి పాల్గొన్నారు.