ఉద్యమాలు విశ్రమించవు

ఉద్యమాలు విశ్రమించవుప్రజలకు అంకితమైన వ్యక్తులకు అలుపురాదు. విశ్రాంతంటూ ఉండదు. ఆశ్చర్యమేమంటే వారికి ‘వార్థక్యం’ కూడా దరిచేరదు. ఎప్పటికీ ‘యూతే!’. కష్టాలు, కడగండ్లూ వారిని వెనక్కి లాగలేవు.
”ముళ్లూ, రాళ్లూ అవాంతరాలెన్ని ఉన్నా ముందు దారి మాది” అని శ్రీశ్రీ తెగేసి చెప్పింది వారి గురించే. త్యాగధనులు కరువైపోతున్న నేటి దశలో కామ్రేడ్‌ పర్సా సత్యనారాయణ వంటివారు ముత్యపు చిప్ప గొంతులో పడ్డ వర్షపు చుక్కలే. ఆణిముత్యాలనేది వారినే. ఆయన గురించి అనేకమంది నాయకులు ఎన్నో విషయాలు చెప్పారు. ఎంతో రాశారు. ఆయన నుంచి నేటితరం తెలుసుకోవాల్సిందీ, ఆయన్నుండి నేర్చుకోవాల్సింది ఒక కీలక విషయం – కష్టాల్లో పుట్టి, కష్టాల్లోనే ఉద్యమ నిర్మాణం చేసి, చివరికి ఆ కష్టాల్లోనే అసువులు బాసినా 1943లో పార్టీ సభ్యుడిగా ఎత్తిన జెండా 2015లో అంతిమ శ్వాస విడిచే వరకూ 72 ఏండ్లపాటు భుజం మార్చలేదు, జెండా దింపలేదు. పేదరికం ఆయన వెన్నంటే ఉండింది. ఆయన పుట్టిన కులంలో ఇంట్లో తిండి తినే అవకాశంలేని వారు రోజుకొకరి (తమ కులం వారే) ఇంట్లో మధ్యాహ్నం భోజనానికి కుదురుతారు. వారిని వారాలబ్బాయంటారు. రెండు పూటలకి అవసరమైనంత ఎవరూ తినలేరు కదా! రాత్రి ఇంట్లో ఉంటే తింటారు, లేకుంటే పస్తుంటారు. దాంతోపాటు రోజూ గుంటూరు రైల్వే స్టేషన్లో ఉదయం 4 గంటలకే వెళ్ళి పేపర్లు తీసుకుని ఇంటింటికి వేసేవారు. అలా ప్రారంభమైన ఆయన జీవితం చివరి వరకూ అలాగే నడిచిందని ఉభయ తెలుగు రాష్ట్రాల సీపీఐ(ఎం), సీఐటీయూ కార్యకర్తలూ చూసుంటారు. బైక్‌ లేకుండా హోల్‌టైమరేంటని వాదించే కొందర్ని నేడు చూస్తున్నాం. పూర్తికాలం కార్యకర్తగా పని ప్రారంభించేముందే స్మార్ట్‌ ఫోన్‌ డిమాండ్‌ పెట్టి సాధించుకునే వారినీ చూస్తున్నాం. ఫలానా నాయకులకి బండి ఉండగా నాకు బస్‌పాస్‌ ఇస్తారా? అని వాదిస్తున్న కొత్త క్యాడర్‌ కొందర్ని చూస్తున్నాం. కమ్యూనిస్టుల జీవితాలు పూలబాటలో నడవ్వనడానికి కా|| పర్సా జీవితం ఒక నిదర్శనం.
టీయూలో ‘ప్యారాచూట్‌’ నేతలుండరు
సీఐటీయూకున్న ప్రత్యేకతేమంటే అటు యాజమాన్యాలతోనూ, ఇటు కార్మికులతోనూ మాట్లాడగలగడం, అవసరమైతే పోరాడగలగడం, కార్మికులను ఒప్పించుకోగలగడం, కార్మికశాఖ అధికారులతో టాకిల్‌ చేయడం, వీటన్నిటితో పాటు ఎటువంటి ప్రలోభాలకూ లొంగకుండా కార్మికవర్గ ప్రయోజనాలను అంటిపెట్టుకొని నిలబడటం కీలకమైనవి. ఎటువంటి వ్యక్తిగత ప్రతిష్టలకూ లోనుకాకుండా కింది నుండి, ఎన్ని మెట్లున్నా ఎక్కిరావడం ముఖ్యం. అటువంటివారే సీఐటీయూలో రాణించడం చూస్తాం మనం.
కామ్రేడ్‌ పర్సా జీవితంలో ఈ ఔన్నత్యం మన కండ్లకు కడ్తుంది. ఉమ్మడి రాష్ట్రకాలం నుండీ పై విషయాన్ని గమనంలో పెట్టుకునే సీఐటీయూ కార్యకర్తల కేటాయింపు చేశాం. పర్సా జీవితాన్ని (ఆయన ఆత్మకథ)ను చదివితే ఒక ట్రేడ్‌ యూనియన్‌ నాయకుడు సామాన్య కార్యకర్త స్థాయి నుండి ఏ విధంగా అంచెలంచెలుగా ఎదగాలో అర్థమౌతుంది. ఆయన జెండా భుజానేసుకుని వలంటీర్‌ డ్యూటీ చేశాడు. బొగ్గుగని కార్మికుడిగా కామ్రేడ్‌ శేష గిరిరావుతో ముందు రహస్యంగా యూనియన్‌ నిర్మాణానికి అవసరమైన పునాదులేర్పాటు చేశాడు. వాస్తవానికి వృత్తిని యూనియన్‌ నిర్మాణానికి ఏ విధంగా ఉపయోగించవచ్చో పర్సాగారి జీవితమే ఒక పుస్తకం. ఆయన ఆయిల్‌ ఇష్యూవర్‌గా ఉన్నప్పుడు కార్మికులకు అర్జీలు రాసి పెడ్తున్నాడని, వర్కింగ్‌ అవర్స్‌లో యూనియన్‌ పనిచేస్తున్నాడనే సాకుతో ఉద్యోగం నుండి తొలగించింది యాజమాన్యం. ఆ రోజుల్లో ”యూనియన్‌ నిర్మాణం వ్యక్తులతో చేయాలి. ఒక్కొక్కరితో పరిచయాలు పెట్టుకోవాలి. ఒకళ్ళతో పెట్టుకున్న సంబంధం ఇంకొకరికి తెలియకూడదు. తెలిస్తే ఎక్స్‌పోజ్‌ అవుతుంది. అంతకంటే ముందు ఉద్యోగం పోతుంది. రహస్యంగా చేయాలి” అని రాశారు పర్సా (పేజి 28). ఇలా పని చేయగలిగిన ఏడాదికి ఆ కామ్రేడ్‌ని పార్టీలోకి తీసుకున్నారట (1943లో). ట్రేడ్‌ యూనియన్‌ నడపాల్సిన విధానం, పార్టీతో కార్మికుల్ని లింకు చేసిన విధానం వంటి అనేక వివరాలు పర్సాగారు తన ఆత్మకథలో రాశారు.
పత్రికల్లో జరిగే ఎక్స్‌పోజర్‌ ట్రేడ్‌ యూనియన్‌లకు ఏవిధంగా ఉపయోగపడ్తుందో కూడా పర్సా గారి అనుభవాల నుండి నేర్చు కోవచ్చు. పర్సాగారి తొలగింపునకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం సింగరేణిలో జరిగిన ”తొలి మేజర్‌ యాక్షన్‌” అని ఆయన రాశారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఆయనే స్వచ్ఛందంగా యూనియన్‌ పని కోసమే రాజీనామా చేశారు (40వ పేజీ).
రహస్య జీవితం
పర్సా గారి ఆనాటి రహస్య జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కార్మికులకు ఒకసారి ఫలానా నాయకుడు తమ సమస్యల పరిష్కారంలో కీలక భూమిక పోషిస్తాడని నమ్మకం కుదిరితే, ఆయన కమ్యూనిస్టు నాయకుడు కూడానని అర్థమైతే ఎన్ని నిర్బంధాల నడుమనైనా రాజ్య నిఘా నుండి తప్పించి కడుపులో పెట్టి చూసుకుంటారనేందుకు పర్సా జీవితమే తార్కాణం. 44, 45 పేజీల్లో రాసిన విషయాలు చదివిన ఏ కార్యకర్తకైనా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆయన రాత్రిళ్లు శ్మశానంలోని సమాధులపైన నిద్ర, పగలు కార్మికుల ఇండ్లల్లో, స్కావెంజర్‌ వృత్తి చేసుకునే ‘రెల్లీ’ కార్మికుల మొదలు అగ్రకులాలకి చెందిన కార్మికుల వరకు గడిపారు. ముస్లిం కార్మికులు సైతం ఆయనకు షెల్టరిచ్చారు. చిన్న చిన్న ఇళ్లు. మలమూత్రాలకు సైతం బయటికెళ్లడానికి అవకాశం లేదు. ”ఆ తల్లులే ఎత్తిపోశార”ని పర్సా రాశారు. వండి పెట్టడమేగాక ఈ సేవ చేసి నాయకుణ్ణి కడుపులో దాచుకోవడం ఏ విధంగా సాధ్యమో నేటి తరానికి ఊహకందని విషయం.
ఔరంగాబాద్‌ జైలు నుండి మరో ముగ్గురితో కలిసి తప్పించుకోవడం, రైలు పట్టాల వెంట మైళ్ళు, మైళ్ళు నడక, ముత్యాల వ్యాపారుల్లాగా బుకాయించి తప్పుకునే ప్రయత్నం వంటివి చదివితే రేపు జూన్‌ 4 తర్వాత ఎలాంటి పరిస్థితి వచ్చినా తట్టుకుని నిలబడగలిగే సామర్థ్యం మనకొస్తుంది.
బొగ్గుగని కార్మికుల ఇళ్లలో అనుభవించి నంత దుర్భర జీవితం కాకున్నా, ఎమర్జెన్సీలో బహుశా ఆయన అండర్‌ గ్రౌండ్‌ జీవితమంతా మల్కాజిగిరిలోని రైల్వే గుమాస్తా పసుపులేటి వెంకటేశ్వర్లు గారింట్లోనే ఉండింది. ఆ సమయంలో ఆయన అందించిన విద్యతో ముందు విద్యార్థి రంగంలోకి, ఆ తర్వాత సీపీఐ(ఎం) పార్టీలోకి వచ్చిన వ్యక్తి అరుణ. ఆ తర్వాత నా భార్య. మా పెళ్ళి కుదిర్చింది కూడా కామ్రేడ్‌ పర్సా, నండూరి ప్రసాదరావుగార్లే. మా పెళ్ళికి అధ్యక్షత వహించింది పర్సాగారు కాగా ఆచార్యత్వం వహించింది ఎన్‌.పి.ఆర్‌గారు. ఆ రకంగా వారితో ప్రయాణం 1980 నుండి 2015 వరకు (35 ఏండ్లు). 1993లో రాష్ట్ర కేంద్రానికి వచ్చిన తర్వాత మరింత పెనవేసుకుంది ఆ ఇద్దరు హేమాహేమీలతో నా (మా) జీవితం.
కార్మికలోకం గురించి రెండు ముక్కలు చెప్పుకోకపోతే కా|| పర్సాగారి జీవితం గురించి సమగ్రంగా చెప్పుకున్నట్టు కాదు. ‘కార్మికలోకం’ (సీఐటీయూ నాటి రాష్ట్ర మాస పత్రిక) గురించి ఆయన పడ్డ తపన అసమాన్యమైనది. బహుశా అనితరసాధ్యమైంది. పోస్టల్‌ డిపార్టుమెంటు ముద్రించిన కార్డు ముక్కల్ని ఎక్కువగా వినియోగించిన వ్యక్తి బహుశా ఆయనేనేమో! కార్మికలోకంలో అంతర్జాతీయ వార్తలు రాయడానికి, లేదా రాసిన దాన్లో లోపాలు సరిదిద్దడానికి ఆయన చివరి వరకూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. వ్యక్తిగతంగా నాకు రాసిన ఆ ముత్యాల సరాలన్నిటిని (ఉత్తరాలు) నేను జాగ్రత్త చేసుంటే బహుశా చాలా మంది ఎంత ‘ధనవంతుల’య్యేవారో. ఏమేమి తప్పులు రాశామో, వాటిని ఎలా రాసుండొచ్చో తెలియజేసేవారు.
ఫ్రూఫ్‌ రీడింగ్‌, బహుశా ఆయన చూసిన తర్వాత తప్పించుకున్న పొరపాట్లుండవు. అంత పర్‌ఫెక్ట్‌గా ప్రూఫ్‌ చూసేవాళ్ళు, అడిగి మీదేసుకుని ఫ్రూఫ్‌లు చూడటం ఆయన దగ్గరే చూసేవాళ్ళం. ప్రతి జిల్లా నాయకులకు గతంలో ఆ జిల్లాలో కార్మికలోకం సర్క్యులేషన్‌ ఎంతుండేదో గుర్తుచేసి ఆ తర్వాత తగ్గడానికి కారణం ఆరా తీసేవారు. కార్మికులందరితో కార్మికలోకం సర్క్యులేషన్‌ చేయించిన శాండ్విక్‌ కార్మికులకూ, నెల్లూరు గూడ్‌ షెడ్‌ హమాలీలను ప్రోత్సహిస్తూ ‘కార్డు ముక్కలు’ రాసే అలవాటుండేది. ఆ రెండు జిల్లాల బాధ్యుడిగా నాకెన్నో అభినందనలు అందేవి.
నాయకులు పుట్టరు, తయారౌతారనేందుకు కామ్రేడ్‌ పర్సా గారి జీవితమే మనకొక నిదర్శనం.
జూన్‌ 2న ఏ ఉత్సవంలో ఉన్నా ఒక త్యాగమూర్తి జీవితానికి వందేళ్లని మరువని కార్యకర్తల సమూహమే భారత విప్లవోద్యమానికి ఒక గ్యారంటీ.
(కా|| పర్సా శత జయంతి సందర్భంగా)
ఆర్‌. సుధాభాస్కర్‌