– రాష్ట్ర ప్రభుత్వం మాట మార్చడం వెనక మతలబు ఏంటి? : డీవైఎఫ్‌ఐ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా బాలీవుడ్ స్థాయిలో రిలీజ్ అయ్యే గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేస్తున్నామనీ,పెంచిన సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించాలని డివైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు కోట రమేష్,ఆనగంటి వెంకటేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా టిక్కెట్ల ధరలను పెంచేది లేదంటూ అసెంబ్లీలో ప్రకటించారని గుర్తు చేశారు. కానీ సినీ పరిశ్రమ వారితో భేటి తర్వాత సీఎం మాట తప్పి గేమ్ చేంజర్ సినిమాకు అనుమతి ఇవ్వడం వెనక ఉన్న మతలబేంటని వారు ప్రశ్నించారు. ఎవరి ప్రయోజనాల కోసం మాట మార్చారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పూటకొ నిర్ణయం తీసుకోవడం సరికాదని హితవు పలికారు. సీఎం అసెంబ్లీలో మాట్లాడిన మాటకు కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేశారు. సినిమా టిక్కెట్ల ధరలను పెంచొద్దనీ, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. టిక్కెట్ల ధరలను పెంచడంతో ప్రేక్షకులపై భారం పడుతుందనీ, వినోదాన్ని పేదలకు దూరం చేయడమేనని తెలిపారు.