రవీంద్రభారతి నుంచి ఫర్నీచర్‌ తరలింపు..

రవీంద్రభారతి నుంచి ఫర్నీచర్‌ తరలింపు..–  అడ్డుకున్న ఓయూ విద్యార్థులు
నవతెలంగాణ- కల్చరల్‌
రవీంద్రభారతి ఆవరణలో బుధవారం స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పర్యాటక, సాంస్కృతిక శాఖ మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ కార్యాలయం నుంచి ఫర్నిచర్‌, ఇతర వస్తువులను తరలిస్తున్న వాహనాలను ఓయూ విద్యార్థులు అడ్డుకున్నారు. నెంబర్‌ ప్లేట్‌ లేని డీసీఎం వాహనంలో ఫర్నీచర్‌ను నింపుతుండగా సమాచారం అందుకున్న విద్యార్థులు అక్కడకు చేరుకుని అడ్డుకున్నారు. ప్రభుత్వానికి చెందిన ఫర్నీచర్‌ను ఎక్కడికి తరలిస్తున్నారని ప్రశ్నించారు. దానికి వారు ‘అవి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సొంత ఫర్నీచర్‌ అనుకున్నాం’ అని తెలిపారు. అనంతరం పోలీసులు, మీడియా అక్కడకు చేరుకోవడంతో ఫర్నీచర్‌ను యథాస్థానంలో పెట్టి వెళ్లిపోయారు. ప్రభుత్వ ఫర్నీచర్‌ను టీఎన్‌జీఓ కార్యాలయానికి తరలించే ప్రయత్నం చేశారని, దీనికి వెనుక కొందరు అధికారులు, ఉద్యోగుల సహకారం ఉందని విద్యార్థులు ఆరోపించారు. సాధారణ పరిపాలన శాఖకు సమాచారం ఇవ్వకుండా అక్రమంగా ఫర్నిచర్‌ ఎలా తరలిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.