– మహేష్‌కుమార్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మోజార్టీ ప్రజల అభిప్రాయం మేరకే అధికార చిహ్నాన్ని ఎంపిక చేస్తామని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ వెల్లడించారు. ఎన్నికలకు ముందుగానే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని కవులు, కళాకారులు, ప్రజాసంఘాల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే తమ మ్యానిఫెస్టోలో పొందుపరించినట్టు తెలిపారు. ఆ ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నదని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ లోక్‌సభ అభ్యర్థి మల్లు రవి, టీపీసీసీ ఆదివాసీ సెల్ చైర్మెన్ బెల్లయ్య నాయక్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాలు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆలోచనల ప్రకారం నిర్ణయం తీసుకోలేదనీ, ప్రజల నుంచి వచ్చిన అకాంక్ష మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సెంటిమెంట్ రాజేసేందుకు ఆంధ్ర అనే పదంపై విషం కక్కారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ ఇస్తే దాన్ని ఆయన స్వలాభం కోసం వాడుకున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతి కార్యక్రమం, ప్రతి అడుగు తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ముందుకు సాగుతున్నదని తెలిపారు. తెలంగాణ చిహ్నంలో ఉద్యమకారులు అభిప్రాయం మేరకు అమరవీరుల స్థూపాన్ని పెడితే మీకున్న కడుపునొప్పి ఏంటని ప్రశ్నించారు. అమర వీరుల చిహ్నాన్ని ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.100 కోట్లు వెచ్చించి నిర్మించిన అమరవీరుల స్మారక భవనంలో ఒక్క అమరవీరుడి పేరైనా చెక్కించారా? అని ప్రశ్నించారు. అందరితో సంప్రదించి, అతి త్వరలో ప్రజల అకాంక్షలకు చిహ్నంగా తీసుకువస్తామన్నారు. ‘చిన జీయర్ స్వామి ముందు సాగిలా పడినప్పుడు ఏ సెంటిమెంట్ గుర్తురా లేదా? అందేశ్రీ రాసిన గీతాన్ని తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన రామకృష్ణతో పాడించలేదా? అయినా కీరవాణితో పాడించాలనే ఆలోచన కాంగ్రెస్‌ది కాదు… అది అందే శ్రీ ఆలోచన. యాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చిన ఆనందసాయి ఆంధ్రవాడు కాదా? రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి, పుల్లెల గోపిచంద్ ఏ ప్రాంతానికి చెందిన వారు? వారిని బ్రాండ్ అంబాసిడర్‌లుగా నియమించలేదా? ఆంధ్ర బిర్యానీ అంటే పనికి రాదన్న కేసీఆర్ మంత్రి ఆర్‌కే రోజా ఇంటికెళ్లి తిన్నపుడు గుర్తుకు రాలేదా? కీరవాణి విషయంలో ఆస్కార్ గెలిచినప్పుడు మీరిద్దరూ కేసీఆర్, కేటీఆర్ ట్వీట్ చేయలేదా? శారద పీఠానికి తెలంగాణ భూములు ఇచ్చినపుడు మీకు గుర్తుకు రాలేదా? పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చారు’ వీటన్నింటికి బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మోజార్టీ ప్రజల అభిప్రాయం మేరకే అధికార చిహ్నాం ఎంపిక
1:48 am