
సర్పంచుల పదవీకాలం ముగియనున్నందున ప్రత్యేక అధికారులు గ్రామాలలోని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నిరంతరం పనిచేయాలని ఎంపీపీ ఆర్మూర్ మహేష్ అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఆయా శాఖల అధికారులు తాము చేపట్టబోయే పనులు చేసిన పనుల వివరాలను చదివి వినిపించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ ప్రత్యేక అధికారులు గ్రామస్థాయి అధికారుల సమన్వయంతో గ్రామాలలోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఐదు సంవత్సరాల కాలం పాటు సర్పంచ్ లు చేసిన సేవలను ఎంపీపీ కొనియాడారు .ఈ సందర్భంగా పదవి కాలం ముగియనున్న మండల సర్పంచులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రవి, ఎంపీడీవో రాజేశ్వర్, తాసిల్దార్ వెంకటరమణ, పి ఆర్ డి రాజేశ్వర్ మరియు అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.