కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసే ఉన్నాయి: ఎంపీ బండి సంజయ్

– మెడమీద తలకాయ ఉన్నోడు బీఆర్ఎస్ తో పోత్తు పెట్టుకోరు
– బీఆర్ఎస్ మునిగిపోయే నావ
– పొత్తులు పెట్టుకున్న చరిత్ర ఈ రెండు పార్టీలది
– కాలేశ్వరం పై బీఆర్ఎస్, కాంగ్రెస్ డ్రామాలాడుతున్నాయి
– బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్
నవతెలంగాణ – వేములవాడ
మెడమీద తలకాయ ఉన్నోడెవ్వరూ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోరని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావ అని, ఆ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదని వెల్లడించారు.  గురువారం ప్రజాహిత తొలిదశ యాత్ర ముగింపు సందర్భంగా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలో బండి సంజయ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి బీజేపీని దెబ్బతీసేందుకు విష ప్రచారం చేస్తున్నాయి,ప్రజలెవరూ వాటిని పట్టించుకోవద్దు’’ అని కోరారు.సోనియాగాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజ్యసభకు వెళుతున్నారు, దేశవ్యాప్తంగా మోడీ చరిస్మని చూసి భయపడి రాజస్థాన్ నుండి రాజ్యసభకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ బహిరంగ మిత్రులేనని, గతంలోనూ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయన్నారు,బీఆర్ఎస్ మునిగిపోయే నావ అని, ఆ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదని అన్నారు.
కాలేశ్వరం పై బిఆర్ఎస్, కాంగ్రెస్ డ్రామాలాడుతున్నాయి: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు డ్రామాలాడుతూ ప్రజలను గందరగోళంలో పడేసి ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గ్యారెంటీలను  ప్రజలు మర్చిపోవాలని కాలేశ్వరాన్ని తెరలేపారని అన్నారు.ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ ప్రభుత్వ ఘోర వైఫల్యముందని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) నివేదిక ఇచ్చిన విషయాన్న గుర్తు చేశారు, దీంతోపాటు రాష్ట్ర విజిలెన్స్ కూడా రిపోర్ట్ ఇచ్చిందన్నారు. గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు కాళేశ్వరం సందర్శించి వచ్చారన్నారు. అయినప్పటికీ మళ్లీ కాళేశ్వరం సందర్శన, విచారణ పేరుతో ఈ డ్రామాలేందని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ రూపొందించిన నివేదికలోని అంశాలను మీడియాకు వివరించారు. ఈ ఒక్క రాజన్న సిరిసిల్ల జిల్లాకు 1408 కోట్ల రూపాయల నిధులు ఇచ్చాం కేంద్రం నయాపైసా ఇయ్యలేదు.. అభివ్రుద్ధి నిధులన్నీ రాష్ట్రానివేనని కేసీఆర్, కేటీఆర్ ఇన్నాళ్లు చేసిన ప్రచారమంతా ఒట్టిదేనని మీడియాకు వివరించారు. తెలంగాణలో గ్రామాల అభివ్రుద్ధికి, ఇండ్ల కోసం మంజూరు చేసిన నిధులను ఎందుకు దారి మళ్లించారో సమాధానం చెప్పాలి. 14, 15 ఆర్దిక సంఘం నిధుల్లో గోల్ మాల్ జరిగింది, మొక్కల పెంపకం కోసం ఇచ్చిన వందల కోట్ల నిధులను దోచుకుతిన్నరు అని విమర్శించారు.  స్వయం ప్రకటిత మేధావి ఎందుకు అభ్యంతరం చెబుతున్నారు. మేం పోస్టర్లు వేస్తే మీరు మెడలో బోర్డులు వేసుకుని తిరుగు.. ఎవరు వద్దన్నారు? నన్ను గెలికితే ఊరుకునే ప్రసక్తే లేదు. గచ్చిబౌలిలో రూ.600 కోట్ల విలువ చేసే భూదాన భూములను ఏ విధంగా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, బోయినిపల్లి మండలంలోని నర్సింగాపూర్ లో 20 ఎకరాల సింగిల్ బిట్ ఎట్లా కొన్నారో అన్నీ బయటపెట్టాల్సి వస్తది పరోక్షంగా మాజీ ఎంపీ కి చురకలాంటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కాళేశ్వరం, క్రిష్ణా నది నీళ్లపై అసెంబ్లీ వేదికగా డ్రామాలాడుతున్నయ్ ,ప్రజలకిచ్చిన హామీల అమలుపై మాట్లాడటం లేదు బీఆర్ఎస్ చేసిన మోసాలను బయటకు రాకుండా ఈ రెండు పార్టీ నేతలు కుట్ర చేస్తున్నరు. కాళేశ్వరం విషయానికొస్తే..నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సందర్శించి గత అక్టోబర్ లో సందర్శించింది. 20 అంశాలపై వివరణ అడిగితే కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు అని తెలిపారు.
‘‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్(2021) నిబంధనలను కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా ఉల్లంచింది. ఇది ఘోర తప్పిదం. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదంవల్ల ప్రజల జీవితాలకు, ఆర్దిక వ్యవస్థకు తీవ్రమైన ప్రమాదం కలిగే అవకాశం ఏర్పడింది. మేడిగడ్డ బ్యారేజీలోని ఒక బ్లాక్ లో తలెత్తిన సమస్యవల్ల మొత్తం బ్యారేజీ సక్రమంగా పనిచేయని దుస్థితి నెలకొంది. ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు మొత్తం బ్యారేజీని ఉపయోగించడానికి అవకాశమే లేదు అని నివేదికలో పేర్కొన్నారు అని అన్నారు.కాళేశ్వరంలో ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు సైతం బలహీనంగా ఉన్నాయి. ఈ బ్యారేజీల్లో సైతం మేడిగడ్డ తరహాలో సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం నెలకొంది. అన్నారం బ్యారేజీ దిగువన బాయిలింగ్ సమస్య సంకేతాలు కన్పిస్తున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, రాష్ట్ర నాయకులు రాణి రుద్రమ రెడ్డి, సంగప్ప, బిజెపి సీనియర్ నాయకులు ఏ రెడ్డి రాజిరెడ్డి, కుమ్మరి శంకర్, లింగంపల్లి శంకర్, కర్ర సంజీవరెడ్డి, రేగుల మల్లికార్జున్, అల్లాడి రమేష్, వాసం మల్లేష్ యాదవ్, గురుకుల దేవేందర్ రెడ్డి,రేగుల సంతోష్ బాబు, జింక అనిల్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.