కేంద్ర పథకాలు క్షేత్రస్థాయిలో అందేల చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల

Steps should be taken to reach the central schemes at the field level: MP Chamalaనవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
కేంద్ర ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం నాడు ఆయన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలుతో కలిసి కలెక్టరేటు సమావేశ మందిరంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.  ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ ఈనెల 22 నుండి పార్లమెంట్ మొట్టమొదటి బడ్జెట్ సమావేశాలు మొదలవుతున్నందున పార్లమెంట్ సభ్యుడినైన నా నుండి ప్రజలు ఎన్నో ఆశిస్తారని, వారి అంచనాలకు అనుగుణంగా ప్రశ్నోత్తరాల సమయంలో జిల్లా ప్రజల సమస్యలపై వివరించడానికి ఇలాంటి సమీక్ష కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అందరికి అందేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇన్ పుట్ అందించి అందుకు అనుగుణంగా అభివృద్ది నిధులు పొందాల్సి ఉందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి 31 వేల కోట్లతో ఆగష్టు చివరిలోపు 2 లక్షల రైతు రుణ మాఫీ చేసి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నారని అన్నారు. రైల్వే శాఖ గురించి మాట్లాడుతూ జనగాం యాదాద్రి స్టేషన్ పనుల నిధులు శాంక్షన్ అయ్యాయని, జనగాం స్టేషన్ 50 శాతం, యాదాద్రి స్టేషన్ 20 శాతం పనులు కావడం జరిగిందని, డిసెంబరు చివరి లోగా అన్ని పనులు పూర్తి అయ్యేలా రైల్వే అధికారులు పూనుకోవాలని తెలిపారు. ప్రతి రోజూ ఇతర ప్రాంతాలకు వెళ్లే ఉద్యోగుల కోసం భువనగిరి, ఆలేరు, జనగాం స్టేషన్లలో రైళ్లు ఆగేలా, పుష్ పుల్ రైల్ భువనగిరి లో ఆగేలా, అలాగే ఇంటర్ స్టేట్ రైల్ సర్వీసులు ఆగేలా కృషి చేస్తానని తెలిపారు.
ఆలేరు పెద్దవాగు అండర్ పాస్ రోడ్ విస్తరణ అవసరమున్నందున రైల్వే శాఖ దృష్టికి తెస్తామని తెలిపారు. నేషనల్ హైవే అధారిటీస్ పై మాట్లాడుతూ చిట్యాల- భువనగిరి రోడ్డు విస్తరణ కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చి అనుమతులు సాధిస్తామని తెలిపారు. భువనగిరి ఎయిమ్స్ ఆసుపతిపై మాట్లాడుతూ.. ప్రతి రోజూ 2500 మందికి పైగా ఔట్ పేషెంట్లకు సేవలందిస్తున్నందున వారికి సరైన క్యూలైన్ సేవలు అందించాలని, ఎయిమ్స్ ఉన్న తరువాత ఎవ్వరూ కూడా హైదరాబాదు వెళ్లని విధంగా సేవలు మెరుగుపరచుకోవాలని సూచించారు. ఎయిమ్స్ వద్ద బస్సులు ఆగే విధంగా బస్సు స్టాప్స్ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. డయాలసిస్, ట్రామకేర్ సేవలు పెంచుకోవాలని యాక్సిడెంట్, ఎవర్జెన్సీ సేవలను జాగ్రత్తగా నిర్వహించాలని, పేషెంట్ల నుండి సంతృప్తికరమైన ఫీడ్ బ్యాక్ అందేలా కృషి చేయాలని సూచించారు. భువనగిరి కోట క్రింద నుండి కోట పైవరకు మొదటి ప్యాకేజీ కింద శాంక్షన్ అయిన 56 కోట్లతో టెండర్ పనులు ప్ర్రారంభించాలని తెలిపారు.
నిరుద్యోగులకు సరైన ఉపాధి అవకాశాలు కలిగేలా స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ నైపుణ్య శిక్షణను పెంచాలని, ఏ రంగంలో శిక్షణకు ఆసక్తి కనబరుస్తారో గమనించాలని, డిమాండ్ ఉన్న కోర్సుల పట్ల శిక్షణ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో నడుస్తున్న పరిశ్రమల పట్ల ప్రజలకు తెలిసేలా, వారికి ఉపాధి కల్పించేలా క్షేత్రస్థాయిలో అవగాహన కలిగించాలని, ముఖ్యంగా ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం 18 ట్రేడులలో ఉపాధి కల్పిస్తున్నందున గ్రామం, మున్సిపాలిటీ వారిగా ప్రచారం కల్పించాలని, అర్పులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసేలా చూడాలని తెలిపారు. త్రాగునీరు సంబంధించి జల్ మిషన్ పథకంలో భాగంగా ప్రతి గ్రామం, అవాసంలో త్రాగునీరు అందించాలని, కొత్తగా ఏర్పాటైన ఆవాసాలకు కూడా త్రాగునీరు అందించాలని, ఎక్కువ మొత్తంలో నీరు అందేలా చూడాలని తెలిపారు. సమగ్ర శిశు పథకం క్రింద నడుస్తున్న అంగన్వాడీలకు స్వంత భవనాలు లేని వివరాలను అందించాలని, భవనాల మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు.గ్రామీణాభివృద్ది  సంస్థ గురించి మాట్లాడుతూ.. ఉపాధి పనులలో అరుౄలైన వారికి పని కల్పించాలని, అలాగే గ్రామాలలో చెరువుల పూడికతీత, ఫారం పాండ్స్, కాలువలలో పూడికతీత, చేపల చెరువులు, పండ్ల తోటల పెంపకం, వ్యక్తిగత భూములలో భూమి అభివృద్ది పనులు, కందకాల పనులు చేపట్టాలని, గ్రామాల అవసరాల పనులు పూర్తి చేయాలని సూచించారు. పర్యావరణానికి హాని కలిగించే పరిశ్రమల పట్ల నిబంధనలు కఠినంగా అమలు చేయాలని, ఎన్.జి.టి. గైడ్ లైన్స్ పాటించేలా క్షేత్రస్థాయిలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పనిచేయాలని తెలిపారు.
భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గురువారం జరిగిన రైతు రుణమాఫీ చరిత్రాత్మకంగా నిలుస్తుందని, 31 వేల కోట్లతో 2 లక్షల రుణ మాఫీ ఎక్కడా జరుగలేదని, రాష్ట్రంలో పండుగ వాతావరణం ఏర్పడిందన్నారు.  కేంద్ర రాష్ట్రాల ఆధ్వర్యంలో జరిగే పనులు, నిధులు, వాటి ప్రయోజనాలు ప్రజలకు తెలియాలని అన్నారు. సాగునీరు సంబంధించి ధర్మారెడ్డి, బునియాదిగాని కాలువ, పిన్నాయిపల్లి పనులు ఈ బడ్జెట్లోనే పెట్టే విధంగా కృషి చేస్తానని, దాదాపు 70 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది కాబట్టి ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చి రెండు సంవత్సరాలలో కాలువల పనులు పూర్తి చేస్తామని తెలిపారు. బస్వాపూర్ మిగిలిపోయిన పనులను కూడా పూర్తి చేస్తామని తెలిపారు. తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయం పెరగాలని, రైతాంగం అవసరం తెలుసుకొని, రైతాంగం మేలు కోరి రాష్ట్ర ముఖ్యమంత్రి 2 లక్షల రుణ మాఫీ ప్రకటించి నిన్న మొదటి విడుతగా 6098 కోట్లతో ఒక లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేశారని అన్నారు.
జిల్లా కలెక్టరు హనుమంత్ కే జెండగే మాట్లాడుతూ.. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై అందరికి అవగాహన ఉండాలని, జిల్లాలో లేని, జిల్లాకు అవసరమైన పథకాలు గుర్తించి వాటి కార్యాచరణకు వివరాలు అందించాలని అధికారులకు సూచించారు. అభివృద్ది పనుల వివరాలను ఎంపికి అందించాలని, వారు పనుల పురోగతిని ఇంకా ముందుకు తీసుకెళ్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు కె.గంగాధర్, జిల్లా గ్రామీణభివృద్ది అధికారి ఎంఎ కృష్ణన్, జిల్లా పరిషత్ సిఇఓ శోభారాణి, మున్సిపల్ చైర్మన్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.