రైతులను మభ్యపెట్టే ఎత్తుగడ : ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్‌

రైతులను మభ్యపెట్టే ఎత్తుగడ : ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ ప్రకటన చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడం పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో రైతులను, ప్రజలను మభ్యపెట్టడానికి వేసిన ఎత్తుగడ అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ విమర్శించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సోనియా గాంధీ జన్మదినమైన డిసెంబర్‌ 9న ఏక కాలంలో రుణ మాఫీ చేస్తామని చెప్పారనీ, వంద రోజుల తర్వాత కూడా చేయలేదని విమర్శించారు. వరి పంటకు మద్దతు ధర తో పాటు ఇస్తామన్న రూ. 500 బోనస్‌ ఏమైందని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్‌ పేరుతో హామీలు అమలు చేయలేకపోతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తప్పించుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద హామీల అమలుకు నిధులు లేవని తెలియదా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ నాయకులు అవినీతిపరులని అనేక సార్లు విమర్శించిన రేవంత్‌ రెడ్డి.. ఇప్పుడు ఆ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌లో చేరగానే అవినీతి తొలిగిపోతుందా? అని ప్రశ్నించారు. రాజకీయ ఉనికి కోల్పోయిన బీఆర్‌ఎస్‌ను ఏదో ఒక రూపంలో కాంగ్రెస్‌ పార్టీ తెరపైకి తెస్తోందని విమర్శించారు. 60 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కిసాన్‌సెల్‌ అధ్యక్షులు కోదండరెడ్డి చెప్పారన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డినేమో ఒక్క రైతు కూడా చనిపోలేదని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. టీవీ సీరియల్‌ మాదిరిగా ఫోన్‌ ట్యాఫింగ్‌ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. ఓవైసీని గెలిపించేందుకే ఇప్పటిదాకా హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ తన అభ్యర్థిని ప్రకటించలేదన్నారు.