– డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీల డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్ కె నాగేశ్వర్‌కు ఎంపీ ఈటల రాజేందర్ బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందేనని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ), భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట రమేష్, అనగంటి వెంకటేశ్, ఆర్‌ఎల్ మూర్తి, టి నాగరాజు ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా అనేక అంశాలపై నాగేశ్వర్ వాస్తవాల ఆధారంగా విశ్లేషణలు చేస్తున్నా రని గుర్తు చేశారు. ఆయన అభిప్రాయాలను స్వేచ్ఛగా చెబుతున్నారని తెలిపారు. ఆయన వ్యాఖ్యలను ఈటల వక్రీకరించటమే కాక, అవమానపరిచే విధం గా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. రాజేందర్ అనుచరులు, బీజేపీ కార్యకర్తలతో ఫోన్లు చేయించి బెదిరింపులకు పాల్పడటం మానుకోవాలని హెచ్చరించారు.
బెదిరింపు దోరణి సరికాదు :సీఐటీయూ
ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌ను సూడో మేధావిగా అభివర్ణిస్తూ మాజీ రాష్ట్ర మంత్రి, ఎంపీ ఈటల రాజేందర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను సీఐటీయూ తీవ్రంగా ఖండించింది. ఈటల మద్దతుదారులు ఆయనపై వ్యక్తిగత దూషణలు, బెదిరింపులకు పాల్పడటాన్ని వ్యతిరేకించింది. ఆదివారం ఈమేరకు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ’15 రోజుల నుంచి అక్రమణకు గురైన చెరువులు, నాలాలపై ప్రభుత్వం నియమించిన హైడ్రా చేపడుతున్న చర్యలపై నాగేశ్వర్ వివిధ ప్రసార మధ్యమాల్లో తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఆయన అభిప్రాయాలను వ్యతిరేకించే స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉంది. బాధ్యత గల ఎంపీ ఈటలకూ ఉన్నది. కానీ ఆయన్ను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడటం సరైందికాదు. ఎమ్మెల్సీగా, జర్నలిస్ట్‌గా ప్రజాతంత్ర హక్కుల కోసం పోరాడుతున్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రోత్సాహంతో ఆయనపై ఈటల, వారి అనుచరుల తీవ్రమైన నిందారోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. వాటిని పరిగణలోకి తీసుకుని డీజీపీ జోక్యం చేసుకోవాలి. వారిపై కేసు నమోదు చేయాలి’ అని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల హక్కుల కోసం, సకల జనుల ప్రయోజనాల కోసం శాసన మండలిలో, ప్రజా పోరాటాల్లో ఆయన ప్రత్యక్షంగా పాల్గొని పోరాడిన ప్రజాప్రతినిధి అని గుర్తు చేశారు. ఈటల వ్యాఖ్యలను రాష్ట్రంలోని ప్రజాస్వామ్యవాదులంతా వ్యతిరేకించాలని వారు కోరారు.