పకడ్బందీగా సామాజిక తనిఖీ నిర్వహించాలి: ఎంపీడీవో

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలంలో సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశం మందిరంలో  ఈనెల 7వ తేదీ నుండి 18వ తేదీ వరకు మండలంలోని ఆయా గ్రామాల్లో  జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై నిర్వహించే సామాజిక తనిఖీ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో 2023-24 సంవత్సరానికి గాను నిర్వహించే సామాజిక తనిఖీపై సామాజిక తనిఖీ బృందం సభ్యులకు, పంచాయతీ కార్యదర్శులకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ఈనెల 7 నుండి 18 వరకు  2023- 24 సంవత్సరానికి గాను మండలంలోని ఆయా గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రూ.6కోట్ల 72లక్షల 7వేలతో  వివిధ పనులు జరిగినట్లు తెలిపారు. ఇందులో రూ. 3 కోట్ల 10 లక్షల 77వేల వేజ్ పేమెంట్, రూ.3 కోట్ల 36 లక్షల 97వేల మెటీరియల్ పేమెంట్లు జరిగినట్లు ఆయన వివరించారు.గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులపై, కూలీలకు చెల్లించిన డబ్బులపై సామాజిక తనిఖీ బృందం సభ్యులు పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలన్నారు. ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా నిక్కచ్చిగా సామాజిక తనిఖీ  జరగాలని ఆయన ఆ సిబ్బందికి సూచించారు. తనిఖీ సందర్భంగా గ్రామాల్లో జరిగిన పనుల వివరాలను, చెల్లించిన మొత్తంలో ఏమైనా తేడాలు ఉంటే  సమగ్రంగా రికార్డుల్లో పొందుపరచాలన్నారు. ఈ సమావేశంలో మండల పంచాయతీ అధికారి సదాశివ్, ఈజీఎస్ ఏపీవో  విద్యానంద్, ఎస్ ఆర్ పి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.