నర్సరీల్లో నిర్దేశించిన లక్ష్యం మేరకు వివిధ రకాల మొక్కలను సిద్ధం చేయాలని ఎంపీడీఓ చింత రాజ శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండలంలోని నాగపూర్, చౌట్ పల్లి గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలను ఆయన సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు కురిస్తే అందించేందుకు, గ్రామాల్లో నాటేందుకు నిర్దేశించిన లక్ష్యం మేరకు నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయాలన్నారు. గతంలో హరితహారంలో నాటిన మొక్కలు చనిపోయిన, ఎండిపోయిన వాటి ప్రదేశంలో కొత్త మొక్కలను నాటించాలని ఈజిఎస్ సిబ్బందికి సూచించారు. వర్షాకాలం ఆరంభమైనప్పటికిని ఎండలు ఎక్కువగా ఉన్నందున నర్సరీలో మొక్కలు ఎండిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నర్సరీ నిర్వాహకులకు సూచించారు. ఉదయం సాయంత్రం వేళల్లో మొక్కలకు నీటిని అందించాలన్నారు. నాటిన మొక్కల్లో 60 శాతం పైగా మొక్కలు బతికేలా తగిన చర్యలు చేపట్టాలన్నారు. నర్సరీ నిర్వహణ పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి సదానంద్, పంచాయతీ కార్యదర్శులు గంగాజమున, సంధ్య, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.