నవతెలంగాణ-శంకర్‌పల్లి
ఎండా కాలాన్ని దృష్టిలో పెట్టుకుని కూలీలకు ఉపాధి హామీ కల్పించాలని శంకర్‌పల్లి ఎంపీడీవో వెంకయ్య అన్నారు. మంగళవారం శంకర్‌పల్లి మండలంలోని మహాలింగాపురం గ్రామంలో ఉపాధిహామీ పనులు జరు గుతున్న తీరును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులు చేస్తున్న సమయంలో కూలీలకు సరైన సౌకర్యాలు కల్పిస్తున్నారా మీరు సక్రమంగా అందిస్తున్నారా లేదా ఫీల్డ్ అసిస్టెంట్లు మేటీలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబ్ కార్డు కలిగిన కూలీలందరికీ తప్పనిసరిగా వంద రోజులపాటు కూలి కల్పించాలని సూచించారు. కూలీ పనులు చేస్తామని వచ్చిన వారికి జాబ్ కార్డు కల్పించి, కూలీ పనులు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లో నర్సరీ మొక్కలను ఎండిపోకుండా జాగ్రత్తగా నీరు పోసి కాపాడాలన్నారు. నర్సరీని ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో నాగభూషణం ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.