నవతెలంగాణ – కమ్మర్ పల్లి
ప్రభుత్వం అందించిన పథకాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా జీవితంలో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన మండలంలోని బషీరాబాద్ గ్రామంలో బీసీ బంధు పథకంలో భాగంగా రూ. లక్ష ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసుకొని నిర్వహిస్తున్న పలు షాపులను ఆయన సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బీసీ బంధు లబ్ధిదారులతో మాట్లాడారు. వ్యాపారం ఎలా సాగుతుంది, బీసీ బంధు పథకంలో అందించిన ఆర్థిక సహాయంతో నిర్వహిస్తున్న వ్యాపారాలు ఏంటి తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కులాలను గుర్తించి ప్రభుత్వం ఈ బీసీ బందు పథకాన్ని ప్రవేశపెట్టిందని, ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయాన్ని సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సూచించారు. ప్రభుత్వ సహాయాన్ని దుర్వినియోగం చేస్తే నష్టపోతారని తెలిపారు. పలువురు లబ్ధిదారు నిర్వహిస్తున్న వ్యాపారాలను చూసి వారిని అభినందించారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.