అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని,ఎవరు ఆందోళన చెందవద్దని మండల ఎంపిడిఓ శ్యాంసుందర్, తహశీల్దార్ రవికుమార్ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల అర్హుల జాబితాలపై గురువారం మండలంలోని మల్లారం,నాచారం,ఇప్పలపల్లి గ్రామాల్లో సభలను పంచాయతీ కార్యదర్శులు చెలుకల రాజు యాదవ్,రజిత గ్రామసభలు ప్రశాంతంగా నిర్వహించారు. పథకాల అర్హుల జాబితాలను గ్రామసభల్లో ఒక్కోటిగా చదివి వినిపించారు. అందులో ఎలాంటి అభ్యంత రాలు వచ్చినా పరిగణనలోకి తీసుకుంటామన్నారు.నాలుగు పథకాలకు సంబంధించి సిద్ధం చేసిన అర్హుల జాబితాలో పేర్లు లేని అర్హత కలిగిన వారు ఎవరైనా ఉంటే తిరిగి మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇతర సమస్యలకు సంబంధించి దరఖాస్తులు ఇచ్చినా గ్రామసభల్లో తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలతో దరఖాస్తులు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే సంబంధిత పథకం అర్హుల జాబితాను గ్రామసభ ఏకగ్రీవంగా ఆమోదించినట్లుగా ప్రకటిస్తామన్నారు.