నవతెలంగాణ-హైదరాబాద్
ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవుల వ్యవహారంలో అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టే, అనుమతించే అధికారాలు ఆర్డీఓకు లేవంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లోని సెక్షన్ 263 ప్రకారం ఆ నోటీసులిచ్చే అధికారం లేదంటూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ జస్టిస్ శరత్ మంగళవారం తీర్పు చెప్పారు. పలువురు ఎంపీటీసీలు, ఎంపీపీలు, వైఎస్‌ఎంపీపీలు దాఖలు చేసిన పిటిషన్లకు విచారణార్హత లేదని చెప్పారు. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, నల్లగొండ జిల్లా చండూర్ ఎంపీపీ పల్లె కల్యాణి, మర్రిగూడ ఎంపీపీ మోహన్‌రెడ్డి, యాదాద్రి జిల్లా రామన్నపేట ఎంపీపీ జ్యోతి, నారాయణపూర్ ఎంపీపీ ఉమాదేవి, వరంగల్ జిల్లా గీసుకొండ ఎంపీపీ సౌజన్య, కరీంనగర్ జిల్లా రామడుగు ఎంపీపీ కలగంటి కవిత, జగిత్యాల జిల్లా మద్నూర్ ఎంపీపీ లక్ష్మీబాయి, నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి ఎంపీపీ శ్రీనివాస్, మాక్లూర్‌కు చెందిన సుజాత, ప్రభాకర్, జనగాం జిల్లా మల్యాల ఎంపీపీ విమల, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ఎంపీపీ సువర్ణ వేసిన పిటిషన్లను కొట్టివేసింది.
తీర్పునకు లోబడే గురుకుల జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ
గురుకుల విద్యా సంస్థల్లో జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీ వ్యవహారంపై హైకోర్టు స్పందించింది. తుది ఉత్తర్వులకు లోబడి ఆ పోస్టుల భర్తీ ఉంటుందని చెప్పింది. గురుకుల విద్యా సంస్థల్లో జూనియర్ లెక్చరర్ల భర్తీకి వెలువడిన నోటిషన్ రూల్స్ అమలు చేయడం లేదంటూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ పి. కార్తీక్ మంగళవారం విచారించారు. ‘జంతుశాస్త్రం, వృక్ష శాస్త్రం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసే వారు ఎంఎస్సీలో ఏయే సబ్జెక్ట్ చేసిన డిగ్రీలో మాత్రం సంబంధింత సబ్జెక్ట్ చేసి ఉండాలని నోటిఫికేషన్‌లో ఉంది. డిగ్రీలో జంతుశాస్త్రం, వృక్ష శాస్త్రం చేసిన ఎంఎస్సీలో మరో సబ్జెక్ట్ చదివిన పిటిషనర్లు కూడా దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల అనంతరం ప్రకటించిన మెరిట్ లిస్ట్‌లో పిటిషనర్ల పేర్లు కూడా ఉన్నాయి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత పిటిషనర్ల అర్హతపై నిపుణుల కమిటీ ఏర్పాటైంది. నోటిఫికేషన్ నిబంధనలను అమలు చేయకపోవడం వల్ల నష్టం జరుగుతుంది’ అని పిటిషనర్లు దాఖలు చేసిన వాటిపై విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.
ఒకే భూమిపై పలు రిజిస్ట్రేషన్లపై కౌంటర్ దాఖలు చేయండి : హైకోర్టు
తమకు అమ్మిన భూమిని పలువురికి రిజిస్ట్రేషన్లు చేయడంపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు స్పందించింది. కౌంటర్ దాఖలు చేయాలని హౌంశాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్‌ఏ, డీజీపీ, సైఫాబాద్ సీఐడీ అడిషనల్ డీజీపీ, సైబరాబాద్ సీపీలకు నోటీసులు జారీ చేసింది. విచారణ ఏప్రిల్ 15కు వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం వట్టినాగులపల్లి గ్రామంలో 460 ఎకరాలకుపైగా భూమిని దాదాపు 3,308 మంది 1983 నుంచి 1986 మధ్య చట్ట ప్రకారం కొనుగోలు చేసి సేల్‌డీడ్ ద్వారా ప్లాట్లు పొందామనీ, ఆ భూములను రెవెన్యూ అధికారులు పాత యజమానుల పేర్లపై ఉంచడం వివాదాలకు తావిచ్చిందంటూ మేడ్చల్ హైదర్‌నగర్‌కు చెందిన రిటైర్డ్ లెక్చరర్ వి.రామారావుతోపాటు మరో 19 మంది హైకోర్టును ఆశ్రయించారు. అనధికారిక ప్రతివాదుల్లో కొందరు మాకు అమ్మిన భూములను డబుల్ రిజిస్ట్రేషన్లు చేస్తూ పోయారని ఆ భూములు కొన్నవారు రియల్ ఎస్టేట్ సంస్థలతో కుమ్మక్కై తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని పిటిషనర్ల వాదన. దీనిపై సీఐడీ విచారణ జరిపి తమ భూములు తిరిగి ఇప్పించాలని కోరారు
అరకు మాజీ ఎంపీ గీతకు ఊరట
ఏపీలోని అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ని మోసం చేసి రూ.42.76 కోట్ల మేరకు రుణం తీసుకున్నారనే కేసులో సీబీఐ కోర్టు విధించిన ఐదేండ్ల శిక్ష అమలును నిలిపివేస్తూ స్టే ఉత్తర్వులు జారీ చేసింది.
ఆమె నాలుగో నిందితురాలిగా, ఆమె భర్త రామకోటేశ్వరరావు ప్రధాన నిందితుడిగా సీబీఐ 2015లో చార్జిషీట్ దాఖలు చేసింది. రెండేండ్ల కిందట సీబీఐ కోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ జరిపారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీలుగా ఆ శిక్షపై స్టే ఇవ్వాలన్న ఆమె న్యాయవాది వాదనలను ఆమోదించారు. 2014లో వైసీపీ తరఫున ఎంపీగా గెలిచిన గీత ఇప్పుడు బీజేపీలో ఉన్నారు.
శివశంకర్ రెడ్డికి షరతులతో బెయిలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఐదో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.’ రెండు లక్షల రూపాయల వ్యక్తిగత బాండ్ తోపాటు అంతే మొత్తానికి మరో రెండు పూచీకత్తులను సీబీఐ కోర్టుకు సమర్పించాలి. ప్రతి సోమవారం హైదరాబాద్ సీసీఎస్‌లో హాజరుకావాలి. కేసు విచారణలో జోక్యం చేసుకోరాదు. సీబీఐ కోర్టు అనుమతి లేకుండా ఏపీలోని సాక్షుల ఇండ్ల వద్దకు వెళ్లకూడదు. పాస్‌పోర్టును పోలీసులకు అప్పగించాలి’ అని జస్టిస్ కె లక్ష్మణ్ షరతులు విధిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.