తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేష్టమైనవి: ఎంపీపీ రాజేశ్వరి

– చిట్యాలలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
నవతెలంగాణ – పెద్దవంగర:
తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేష్టమైనవని ఎంపీపీ ఈదురు రాజేశ్వరి ఐలయ్య, తొర్రూరు సీడీపీఓ హైమవతి అన్నారు. మండల పరిధిలోని చిట్యాల గ్రామంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ కవిత రెడ్డి ఆధ్వర్యంలో శనివారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముర్రుపాల ఆవశ్యకతను గర్భిణీ స్త్రీలకు వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ..ప్రతి తల్లి పురిటి బిడ్డకు అందించే మొదటి పౌష్టికాహారం ముర్రుపాలేనని అన్నారు. పుట్టిన గంటలోపు బిడ్డకు ముర్రుపాలు పట్టాలని, ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టించాలని తద్వారా బిడ్డకు వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుందన్నారు. ఈ పాలు బిడ్డకు తొలి ఆహారమని, బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి తల్లిపాలే ముఖ్యమన్నారు. తల్లిపాల వినియోగం వల్ల బిడ్డకు ఎన్నో రకాల ఉపయోగాలున్నాయని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజు, ప్రధానోపాధ్యాయుడు మడిపెద్ది వెంకన్న, అంగన్వాడీ టీచర్లు రాజేశ్వరి, శోభ, కనుకదుర్గ, పీఈటీ గీత, అరుణ, గర్భిణీ బాలింతలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.