
వడగండ్ల వర్షంతో పంట నష్టానికి గురైన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చిన్నకోడూరు ఎంపిపి కూర మాణిక్య రెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాధాకృష్ణ శర్మ, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్ అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు సూచన మేరకు చిన్నకోడూరు, ఇబ్రహీంనగర్, చంద్లాపూర్, చౌడారం గ్రామాలలో మంగళవారం కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను కాంగ్రెస్ నాయకులు గానీ, ప్రభుత్వం పక్షాన గాని ఎవరు స్పందించలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో క్షేత్ర స్థాయిలో పరిశీలించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పిఏసిఎస్ చైర్మన్ లు సదానందం, కనకరాజు, బిఆర్ఎస్ నాయకులు కొండం రవీందర్ రెడ్డి, కాముని ఉమేష్ చంద్ర, సురగోని రవీందర్, నెమలి సుభాష్ తదితరులు పాల్గొన్నారు.