అలంకారప్రాయంగానే ఎంపిటిసి పదవులు

– గట్లకానీపర్తి మాజీ ఎంపీటీసీ బత్తిని రజని
నవతెలంగాణ – శాయంపేట : ఎంపిటిసి పదవులు కేవలం అలంకారప్రాయంగానే మిగిలిపోతున్నాయని గట్లకానీపర్తి మాజీ ఎంపీటీసీ బత్తిని రజని సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ఎంపిటిసిలకు, సర్పంచ్లకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఎంపీడీవో ఫణిచంద్ర అధ్యక్షతన నిర్వహించగా, ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ప్రతి ఒక్క ఎంపీటీసీతో మాట్లాడిస్తుండగా ఎంపిటిసి రజని మాట్లాడుతూ ఎంపీటీసీగా కేవలం మండలానికి చాయ్ బిస్కెట్ల కోసం వచ్చినట్లు ఉండేదని అన్నారు. కేవలం సమావేశాలకు హాజరు కావడంతోనే సరిపోయిందని అన్నారు. రాబోయే కాలంలోనైనా ఎంపిటిసిలకు గ్రామపంచాయతీలో కుర్చీ వేయించాలని, జెండా వందన కార్యక్రమంలో జెండా ఎగరవేతలో అవకాశం కల్పించాలని, గ్రామ అభివృద్ధి కోసం నిధులు కేటాయించేలా చూడాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే జి ఎస్ ఆర్ మాట్లాడుతూ ఎంపిటిసి రజిని చెప్పిన మాటలను గుర్తు చేస్తూ మూడంచల విధానాన్ని ఎన్టీఆర్ ప్రవేశపెట్టగా, రాను రాను ఎంపీటీసీ, జెడ్పిటిసి పదవుల కోసం 5 అంచెల విధానం అమల్లోకి వచ్చిందని, దీంతో నిధులు రాలేదని అన్నారు. మూడంచల విధానం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడానని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో బిల్లు ప్రవేశపెడితే ఎన్డీఏ కూటమి అడ్డుకుంటుందని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు అంచల విధానానికి బిల్లు ప్రవేశపెడితే తెలంగాణ ప్రభుత్వానికి అవకాశం ఉంటుందని అన్నారు. ప్రజా ప్రతినిధులు పదవుల కోసం చూడకుండా ప్రజల మధ్య ఉంటే ప్రజలే పదవులు కట్టబెడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాసాని చంద్రప్రకాష్, పరకాల ఏఎంసీ మాజీ చైర్మన్ పోలపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి చల్లా చక్రపాణి, అధికారులు పాల్గొన్నారు.