దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సముద్రఖని, నటుడిగానూ అన్ని భాషల ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నారు. ‘అల వైకుంఠపురములో’, ‘క్రాక్’ నుంచి మొదలు పెడితే ‘హనుమాన్’ వరకు ప్రతి సినిమాలోనూ తాను ధరించిన పాత్రలకు నూటికి నూరు శాతం న్యాయం చేశారు. తన అద్భుత నటనతో తెలుగువారికి చేరువైన సముద్రఖని ఇప్పుడు ‘మిస్టర్ మాణిక్యం’ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నంద పెరియసామి దర్శకత్వంలో జీపీ రేఖా రవి కుమార్, చింతా గోపాలకష్ణా రెడ్డి, రాజా సెంథిల్ ఈ చిత్రాన్ని నిర్మించారు.డిసెంబర్ 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఏషియన్ సునీల్ నారంగ్ చేతుల మీదుగా సినిమా ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ పోస్టర్ ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా సముద్రఖని మాట్లాడుతూ,”విమానం’ తర్వాత నేను ప్రధానపాత్రలో నటించిన సినిమా ఇది. ఈ సినిమా ‘విమానం’ సినిమాకి మించిన మంచి పేరు తెస్తుందన్న నమ్మకం ఉంది. మానవతా విలువలు ప్రధానాంశంగా రూపొందిన సినిమా ఇది. ప్రతి ఒక్కరి మనసులను హత్తుకునే అనేక అంశాలు ఇందులో వున్నాయి. కుటుంబంతో సహా థియేటర్లకు వచ్చి చూసేంత క్లీన్ కంటెంట్ ఉన్న సినిమా ఇది’ అని అన్నారు. ‘ఈ సినిమాకి పనిచేసిన సముద్రఖని, నాజర్, భారతీరాజా… ఇలా ప్రతి ఒక్కరూ ఒక మంచి సినిమాకు పనిచేశామన్న సంతప్తిని వ్యక్తం చేస్తున్నారు. నిర్మాతగా ఇది నాకు మొదటి సినిమా. చింతా గోపాలకష్ణారెడ్డి, రాజా సెంథిల్ నుంచి ప్రోత్సాహం లభించడంతో మేం ముగ్గురం కలసి ఈ సినిమా నిర్మించాం’ అని నిర్మాతలలో ఒకరైన రవి అన్నారు. దర్శకుడు నంద పెరియసామి మాట్లాడుతూ, ‘మానవతా విలువలతో కూడిన, వాస్తవ సంఘటనలకు అద్దం పట్టే విధంగా ఉండే కథాంశంతో దీన్ని రూపొందించాను. ఇందులో సముద్రఖని భార్యగా అనన్య నటించారు’ అని తెలిపారు.