ఎంసెట్‌ ఇక ఈఏపీసెట్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ సహా వివిధ వృత్తి విద్య, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం 2024-25 విద్యాసంవత్సరానికి సంబం ధించిన ప్రవేశ పరీక్షల తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది. గురువారం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి ఆ వివరాలను విడుదల చేశారు. అయితే టీఎస్‌ఎంసెట్‌ పేరును ప్రభుత్వం మార్చింది. ఎంసెట్‌లో ఉన్న మెడికల్‌ సీట్ల భర్తీ నీట్‌ ద్వారా జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఎంసెట్‌లో ఉన్న ‘ఎం’ను తొలగించింది. అయితే ఎంసెట్‌ ద్వారా ఫార్మసీ సీట్లు భర్తీ అవుతున్నా అందులో పీ అనే అక్షరం లేదంటూ ఆయా కాలేజీ యాజమాన్యాలు ఉన్నత విద్యామండలి దృష్టికి తెచ్చాయి. దీంతో టీఎస్‌ ఎంసెట్‌ 2024-25 విద్యాసంవత్సరం నుంచి టీఎస్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ (ఈఏపీ) సెట్‌గా ఉంటుందని ప్రకటించింది. మే తొమ్మిది నుంచి 13 వరకు ఎంసెట్‌ (ఈఏపీసెట్‌) రాతపరీక్షలు జరుగుతాయి. ఇందులో ఇంజినీరింగ్‌ కోర్సులకు సంబంధించి అదేనెల తొమ్మిది నుంచి 11 వరకు, 12, 13 తేదీల్లో అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ రాతపరీక్షలుంటాయి. ఈఏపీసెట్‌ను మళ్లీ జేఎన్టీయూ హైదరాబాద్‌ నిర్వహిస్తుంది. ఈసెట్‌కు ఉస్మానియా విశ్వవిద్యా లయం ఆధ్వర్యంలో పరీక్షలు జరుగుతాయి. కాగా అదేనెల ఆరో తేదీన ఈసెట్‌ రాతపరీక్షలుంటాయి. బీఈడీ కోర్సులో ప్రవేశం కోసం నిర్వహించే ఎడ్‌సెట్‌ పరీక్ష మే 23న ఉంటుంది. దీన్ని నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. మూడేండ్ల లా కోర్సు, ఐదేండ్ల లా కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్‌ జూన్‌ మూడున నిర్వహిస్తారు. అదే రోజు పీజీలాసెట్‌ జరుగుతుంది. లాసెట్‌, పీజీ లాసెట్‌లను ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహి స్తుంది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఐసెట్‌ పరీక్షలు అదేనెల నాలుగు, ఐదు తేదీల్లో జరుగుతాయి. దీన్ని కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. ఎంటెక్‌, ఎం ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఈసెట్‌ పరీక్షలు అదేనెల ఆరు నుంచి ఎనిమిదో తేదీ వరకు జరుగుతాయి. ఈసెట్‌ను జేఎన్టీయూ హైదరాబాద్‌ నిర్వహిస్తుంది. బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీఈసెట్‌ పరీక్షలు జూన్‌ 10 నుంచి 13 తేదీల్లో జరుగుతాయి. దీన్ని శాతవాహన విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మెన్‌ ఎస్‌కే మహమూద్‌, కార్యదర్శి ఎన్‌ శ్రీనివాసరావు, జేఎన్టీయూహెచ్‌ వీసీ కట్టా నర్సింహారెడ్డి, ఓయూ వీసీ డి రవీందర్‌, కేయూ వీసీ టి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.
త్వరలోనే కన్వీనర్ల పేర్లు ఖరారు
ప్రవేశ పరీక్షలకు సంబంధించిన రాతపరీక్షల తేదీలు, వాటిని నిర్వహించాల్సిన విశ్వవిద్యాలయాలు ఖరారు కావడంతో ఇక అందరి దృష్టి కన్వీనర్లపై పడింది. త్వరలోనే వారి పేర్లను ఉన్నత విద్యామండలి ఖరారు చేసి ప్రకటించనుంది. గతేడాది ఎంసెట్‌ కన్వీనర్‌గా డీన్‌ కుమార్‌, పీజీఈసెట్‌ కన్వీనర్‌గా రవీందర్‌రెడ్డి, ఈసెట్‌ కన్వీనర్‌గా శ్రీరాంవెంకటేశ్‌, లాసెట్‌ కన్వీనర్‌గా విజయలక్ష్మి, ఎడ్‌సెట్‌ కన్వీనర్‌గా ఎ రామకృష్ణ, ఐసెట్‌ కన్వీనర్‌గా పి వరలక్ష్మి, పీఈసెట్‌ కన్వీనర్‌గా రాజేష్‌కుమార్‌ వ్యవహరించారు. వారిలో ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ రామకృష్ణ ఉద్యోగ విరమణ పొందారు. దీంతో ఆయన స్థానంలో ఎడ్‌సెట్‌ కన్వీనర్‌గా కొత్త వారిని ఉన్నత విద్యామండలి నియమించనుంది. మిగిలిన ప్రవేశ పరీక్షలకు దాదాపు పాత వారినే కన్వీనర్లుగా కొనసాగించే అవకాశమున్నట్టు తెలిసింది. మొదటిసారి కన్వీనర్‌గా పనిచేసిన వారినే రెండోసారి నియమించే అవకాశముంటుందని ఉన్నత విద్యామండలిలో ఓ అధికారి అన్నారు.