నవతెలంగాణ-తాంసి
ముదిరాజ్ కులస్తులమైన వెనుకబడిన కులానికి చెందిన ముదిరాజ్ లను బీసీ(డి) నుంచి బీసీ(ఎ) జాబితాలో చేర్చాలని కోరుతూ శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ముదిరాజ్ జిల్లా అధ్యక్షులు శివయ్య ఆధ్వర్యంలో ముదిరాజ్ కులస్తులతో కలిసి డిప్యూటీ తహసీల్దార్ విష్ణు జాదవ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల మేనిఫెస్టోలో అభయ హస్తంలో మీరు ఇచ్చిన హామీలు మా వర్గాలలో కొంత విశ్వాసాన్ని నింపాయని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు మాసాలు పూర్తయిన సందర్భంగా మా సమస్య పరిష్కారం కొరకు దృష్టి సారించాల్సిందిగా కోరుతున్నామని అన్నారు. హామీ ప్రకారం జీఓ నెంబర్ 15వ తేదీ 2009 ముదిరాజ్ ముత్తారాశి తెనుగోళ్లు బీసీ(డి) నుంచి బీసీ(ఎ)లోకి మార్చాలన్నారు. 2014 సర్వే ప్రకారం తెలంగాణ జనాభాలో ఎక్కువ సంఖ్య కలిగిన జనాభాగా వెనుకబడిన తరగతుల్లో దాదాపు మొత్తం జనాభాలో 14 శాతంగా ఉన్నామన్నారు. మా కులానికి చెందిన వారు మత్స్య వృత్తి తోటలు పెంపకం వంటి వృత్తి పైన ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నామన్నారు. రాజకీయరంగంలో ముదిరాజ్‌ల ప్రాతినిధ్యం పెంచడానికి మంత్రివర్గంలో చోటు కల్పించాలన్నారు. 50 సంవత్సరాలు నిండిన ప్రతి ముదిరాజ్ కులస్తులకు గౌడ కులస్తులకు ఇస్తున్న మాదిరిగా మాకు కూడా ఆసరా పెన్షన్ ఇవ్వాలన్నారు తెలంగాణ శాసనసభలో మూడు స్థానాలు రాజ్యసభలో ఒక స్థానం కల్పించి 10శాతం కార్పొరేషన్‌లలో చైర్మెన్లుగా నియమించాలని కోరారు. వినతిపత్రాన్ని సంబంధిత అధికారులకు చేరే విధంగా చూడాలని కోరారు. ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గుగ్గిల పొచ్చన్న, స్వామి, శ్రీకాంత్, రమకాంత్, మహేందర్ శ్రీనివాస్, రాఘవేంద్ర, ముదిరాజ్ కుల సంఘ సభ్యులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.
బోథ్ : ముదిరాజ్‌లను బీసీ(ఎ)లో చేర్చాలని కోరుతూ శుక్రవారం మండలంలోని సొనాల గ్రామ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో ఉప తహసీల్దార్ మల్లేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం మండలాధ్యక్షుడు గుంజాల బోజన్న మాట్లాడుతూ గతంలో దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన జీఓ నెంబర్ 17ను యధావిధిగా అమలు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ముదిరాజ్ సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్సీ పదవులతో పాటు ఒక రాజ్యసభ పదవి 10 కార్పొరేషన్ పదవులు కట్టబెట్టాలని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ముదిరాజ్ సంఘం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నాయుడు శ్రీనివాస్, కోశాధికారి మహిపాల్, మండల మాజీ అధ్యక్షులు సున్నపు శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు మెండు శ్రీనివాస్ పాల్గొన్నారు.
సారంగాపూర్ : ముదిరాజుల కులస్థులను బీసీ(డి) నుంచి బీసీ ఏ గ్రూపులోకి చేర్చాలని కోరుతూ శుక్రవారం తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం మండల ముదిరాజ్ సంఘం అద్యక్షులు బోండ్ల రమేష్ మాట్లాడారు. ముదిరాజుల అభివృద్ధికోసం ప్రతి సంవత్సరం రూ. 1000 కోట్ల నిధులు విడుదల చేయాలన్నారు. మత్స్యసంపదపై గంగ పుత్రులతో పాటు ముదిరాజులకు చట్ట పరమైన ఆదేశాలు జారీ చేయాలి. తెలంగాణ మత్య్య అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేసి చైర్మెన్‌ను ముదిరాజును ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు దొడ నర్సయ్య, తీగల మోహన్, గంగాధర్, నర్సయ్య, గంగాధర్, సాయెందర్ పాల్గొన్నారు.