– ఇక్కడి నుండే పాలన కొనసాగిస్తా.
– ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తాం :మంత్రి సీతక్క
నవతెలంగాణ – ములుగు
ములుగు ఆడబిడ్డగా ఆదరించి ఆశీర్వదించిన ములుగు నియోజకవర్గ ప్రజలకు సేవకురాలిగా ఉంటానని పంచాయతీ రాజ్, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారిగా ములుగు జిల్లాకు వచ్చిన మంత్రి సీతక్కకు ములుగు ఎస్పీ గౌస్ ఆలం పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. మంత్రి సీతక్కకు గౌస్‌పల్లి, మల్లంపల్లి, భూపాల్‌నగర్, జాకారం గ్రామాల్లో మహిళలు బతుకమ్మలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి గట్టమ్మ దగ్గరికి చేరుకొని తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ములుగుకు చేరుకొని చౌరస్తాలో మంత్రి సీతక్క మాట్లాడారు. అభివృద్ధి అంటే అద్దాల మేడలు రంగు, రంగుల గోడలు కాదని, ప్రతి ఒక్క పేదవారి నైతిక అభివృద్దే దేశ, రాష్ట్ర అభివృద్ధి అని నమ్మిన వ్యక్తినని తెలిపారు. ఇక ములుగు నుంచే పాలన కొనసాగిస్తానని, రాష్ట్రంలో ఉన్న గ్రామాలు అభివృద్ధి కోసమే తనకు పంచాయతీ రాజ్ శాఖ ఇచ్చారని తెలిపారు. ప్రగతి భవన్ ముందు పేదలకు అడ్డుగా ఉన్న ఇనుప కంచెలను తొలగించామని, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీ ఇచ్చిన 6గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. దానిలో రెండు ప్రారంభమయ్యాయని అన్నారు. రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీ, జెడ్పీటీసీ, సింగిల్ విండో ఎన్నికల్లో ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని పార్టీ ప్రజా ప్రతినిధులకు హితబోధ చేశారు. ఇందిరమ్మ రాజ్యపాలన చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజలు, అధికారులు, పత్రిక, మీడియా చేసే సూచనలను పరిగణలోకి తీసుకుంటూ వెలుగులోకి రాని వాటిని సైతం తెలుసుకొని పరిష్కరిస్తానని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పైడాకుల అశోక్, టీపీసీసీ కార్యదర్శి కూచన రవనీరెడ్డి. కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఖానోత్ రవిచందర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వంగ రవియాదవ్, అధికార ప్రతినిధి అహ్మద్ బాషా, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.