రంజీ ఫైనల్లో ముంబయి

– తమిళనాడు ఇన్నింగ్స్‌ ఓటమి
– రంజీ సెమీస్‌
ముంబయి: రంజీ ట్రోఫీలో ముంబయి ఆధిపత్యం కొనసాగుతుంది. సెమీఫైనల్లో తమిళనాడుపై ఇన్నింగ్స్‌ విజయం నమోదు చేసిన ముంబయి.. రికార్డు స్థాయిలో 48వ సారి రంజీ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. శార్దుల్‌ ఠాకూర్‌ ఆల్‌రౌండ్‌ షోతో తమిళనాడు చతికిల పడింది. ముంబయి బౌలర్ల దెబ్బకు తమిళనాడు రెండో ఇన్నింగ్స్‌లో 51.5 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో సైతం తమిళనాడు 146 పరుగులే చేసింది. శార్దుల్‌ ఠాకూర్‌ వీరోచిత శతకంతో ముంబయి తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌ లోటు అధిగమించకుండానే తమిళనాడు 20 వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్‌ 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ముంబయి.. మార్చి 10 నుంచి జరుగనున్న టైటిల్‌ పోరుకు సై అనేసింది. శార్దుల్‌ ఠాకూర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు.