మునాసు వెంకట్‌ ‘మినీ’లు

మునాసు వెంకట్‌ 'మినీ'లుఆరోగ్యకరమైన తిండి ఉన్నట్టు ఆరోగ్యకరమైన కవిత్వం ఉంటుంది. కవిత పెద్దగా ఉంటే కవిత్వం బాగుంటుందని చెప్పగలుగుతామా? కవిత చిన్నగా ఉంటే దానిని పూర్తిగా వదిలేస్తామా? వాక్యాలు బలంగా ఉంటేనే కవిత నిలబడుతుంది. అదిహొహొ పెద్ద కవిత అయినా, మినీ కవిత అయినా. కాకపోతే మినీ కవిత చురక పెట్టేదిగానో, వ్యంగ్యంగానో, ఆహా అనిపించేలాగానో ఉండాలి. పేలవమైన వాక్యాలు రాసి మినీ కవితలని మభ్యపెట్టలేం. మునాసు వెంకట్‌ రాసిన ఈ మినీలను చూస్తే మనం ఖచ్చితంగా ఓ అభిప్రాయానికి వస్తాం. రాస్తే ఇలాంటివి రాయాలి అనుకుంటాం.చాలా కవితల్లో తన అస్తిత్వాన్ని తెలియజేసే పదాల ప్రయోగం ఈ కవి చేస్తుండడం గమనిస్తాం.
బహుజనుడుగా తమ వత్తి నేపథ్యంలోంచి ఎన్నో కవితలు రాశారు. రాస్తున్నారు. కొంతమందికి ఈ విషయం రోటీన్‌గా అనిపించొచ్చు. కానీ ఈ కవి ఎప్పటికప్పుడు తాజాదనం పట్టుకొస్తాడు.
తనను గమనించిన వాళ్ళకి తన సజనలోని నవ్యత పట్టుబడుతుంది. కవిత్వమంతా చెరువు చుట్టూ, చేపలు చుట్టూ తిరిగినా ఈ కవి ఆకాశాన్ని, చంద్రున్ని వదలడు. అదే ఈ కవి అభివ్యక్తిపరమైన బలం.
1. చాపల మధ్య చందమామ
చెరువంత వెన్నెల కౌసు
చెరువులో రకరకాల చేపలు (చాపలు) ఉంటాయి. అందులో చందమామలు ఉంటాయి. సాధారణ కవిత్వం పోలికల్లో చందమామలను వాడుతుంటాం. ఈ మినీలో రెండు అర్థాలుగా ధ్వనించే ‘శ్లేష’ ప్రయోగం కనిపిస్తుంది. చివరి వాక్యంలో ప్రయోగించిన ‘వెన్నెల’ మళ్ళీ ఇది ఆ చందమామ కాదు మన మామ చందమామని అర్థం చేయిస్తుంది. ‘కౌసు’ అనేదిహొ చేపల చెరువు దగ్గర ఎక్కువ ఉంటుంది. ఇది చేపల వాసనకు సంబంధించినది. ఏ సంబంధం లేని వెన్నెలను, కౌసును ఒక దగ్గర చేర్చి ఓ కొత్త రూపాకాన్ని సాధించటంతో ఈ మినీ ఆకట్టుకుంటుంది. కొన్ని రూపకాలు తెచ్చిపెట్టుకున్నట్టు ఉంటాయి. ఇది సహజంగా ఒదిగిపోయింది.
2. ఏరు పోతు పోతు
గులకరాళ్ళకు ప్రాణం
పోసింది గలగల మని చప్పుడు!
ప్రవహించే గుణం ఉండాలి. ఒకే చోట ఆగిపోవటం ఎవ్వరికీ మంచిది కాదు. ఊర్లల్లో ప్రవహించే ఏరు నుండి అలాంటి జీవిత పాఠం ఒకటి నేర్చుకోవచ్చు. ఏరు ప్రవహించేటప్పుడు ఎన్నో దశ్యాలు మనకు కనిపిస్తాయి. ఆకులు తేలుతూ వెళ్ళటం, విరిగిన కొమ్మలు నీళ్ళతో పాటు కొట్టుకుపోవడం గమనిస్తుంటాం. అటువంటి ప్రదేశాల్లోనే ఈ కవి చూపు లీనమైంది. ఇందులోంచి కవి తత్వం రాబట్టాడు. ఇంకో రూపంలో చూస్తే ఓ దశ్యాన్ని రాబట్టాడు. దశ్యపరంగా మాట్లాడుకున్నప్పుడు ఏరు మధ్యలో ఉండే రాళ్ళ మీదుగా నీరు ప్రవహిస్తున్నప్పుడు ఒరుసుకొని వెళ్ళే శబ్దం గలగల మని చప్పుడు చేస్తుంది. తత్వం పరంగా మాట్లాడుకున్నప్పుడు ప్రవహించే గుణాలున్న మనిషి బండరాయి లాంటి వాన్ని కూడా మార్చగలుగుతాడని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి కవితా వాక్యాలు జీవితం మీద కవికున్న సాధికారతను చూపెడుతున్నాయి.
3. క్షమించు ప్రియా నీకు
ఏ పూలు తేలేను
తోటంతా తుమ్మెదలు ముద్దాడిన
ఎంగిలి పూలే!
ఈ వాక్యాల్లో ప్రేమికుడి స్వచ్ఛమైన ఆలోచన కనబడుతుంది. ప్రేయసి పట్ల తనకున్న ప్రేమ, ఆమె పట్ల తనకుండే శ్రద్ధ తొణికిసలాడుతుంది. ప్రేయసీతో అర్థిస్తున్నట్టు మాట్లాడే మాటల్లా కనిపిస్తున్నా అందులో తీవ్రమైన ప్రేమస్థితి దాగుంది. మలినాలు అంటుకోని అచ్చమైన ప్రేమను అందించాలనే ప్రేమికుడి ఆరాటాన్ని కవి ఇలా చూపించడం మెచ్చుకోదగినది. ప్రేమరసాన్ని ఒంపే వాక్యాలివి. స్వచ్ఛమైన ప్రేమికులకు పూలతో పనిలేదన్న నిగూఢార్థంతో కూడిన ఒక ఊహను కూడా కవి మనకు వదిలేశాడు. ఈ వాక్యాలను చదువుతూ ఉంటే ఆకట్టుకునేట్టుగా ఉంటూనే కొంత అలజడి రేపుతున్నాయి. ఆలోచన కలిగిస్తున్నాయి.
మునాసు వెంకట్‌ రాసిన మినీలలో ఇంకా చాలా ఉన్నాయి. ఫేస్‌బుక్‌ లో స్క్రోల్‌ చేస్తుంటే ఇవి నా కంటబడ్డాయి. మీరు చదవాలంటే వారి ఫేస్‌ బుక్‌ గోడపైకి వెళ్ళండి. చెరువును, చందమామను, ప్రకతిని, సెలయేళ్ళనే కాక ఇంకా ఎన్నో వారి కవిత్వంలో దర్శించండి. ఒక్కోసారి ఎన్ని పెద్ద కవితలు రాసినా ఇలాంటి మినీల కిందకి రావని అనిపిస్తది.
ఇది నిజంగా మినీల కాలం. కవిత్వాన్ని పోస్టర్‌ చేసి ఎంతోమంది అభిమానులను కూడగట్టుకోవచ్చు.
– డా||తండా హరీష్‌ గౌడ్‌
8978439551